CBI Vs AP Police : వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ ఎస్పీపై పోలీస్ కేసు ! తర్వాత ఏంటి ?
సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై వివేకా హత్య కేసులో అనుమానితుడు ఉదయ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ..కోర్టు ఆదేశాలతో పులివెందుల పోలీసులు కేసు పెట్టారు. దర్యాప్తులో ఉన్న సీబీఐ అధికారిపై కేసు పెట్టడం ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ( YS Viveka Murder Case ) దూకుడుగా విచారణ జరుపుతున్న సీబీఐ ఎస్పీ రాం సింగ్‌పై కడప రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని కొంత మందికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని భయపెడుతున్నారంటూ యూఐసీఎల్ ఉద్యోగి ఉదయ్‌కుమార్ రెడ్డి ( Uday Kumar Reddy ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్ర దర్యాప్త సంస్థకు చెందిన అధికారి అదీ కూడా కీలకమైన కేసు దర్యాప్తులో ఉన్న అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. సీబీఐ అధికారి రాంసింగ్‌పై ( CBI SP Ram singh ) ఇప్పటికి అటు అనంతపురం ఇటు కడప ఎస్పీలకు ఇద్దరు ఫిర్యాదు చేసి ఉన్నారు. అయితే ఆ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ మూడో ఫిర్యాదుగా వచ్చిన ఉదయ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ విషయంలో మాత్రం కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది.
సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై ఫిర్యాదు చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి పులివెందులలో ఉన్న యూరేనియం ఫ్యాక్టరీ ఉద్యోగి. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితునిగా పేరు ఉంది. గతంలో ఓ సారి ఆయనను సీబీఐ పిలిచి విచారణ జరిపింది. అప్పట్లో ఫోన్ స్వాధీనం చేసుకుంది. ఇటీవల మరోసారి పిలిచి ప్రశ్నించింది. ఆ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీబీఐ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు అనుమానితులపై ధర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
సీబీఐ అధికారి రాంసింగ్ పై గత నవంబర్ 29న వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ఇరికించేలా సాక్ష్యం చెబితే సీబీఐ అధికారులు రూ. పది కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారంటూ కల్లూరు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకా హత్య తర్వాత గంగాధర్ రెడ్డిని అప్పట్లో సిట్ అధికారిగా ఉన్న సీఐ శ్రీరామ్ ... దేవిరెడ్డి శంకర్ రెడ్డి హత్య చేయించినట్లు ఒప్పుకోమని తీవ్ర ఒత్తిడి తెచ్చారని డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఆశ చూపారని గంగాధర్ రెడ్డి ఫిర్యాదులో తెలిపారు. ఆ తర్వాత డిసెంబర్ 13వ తేదీన వివేకా పీఏ కృష్ణారెడ్డి కడప ఎస్పీని కలిసి తనకు ప్రాణ హానీ ఉందని రక్షణ కల్పించాలని మొర పెట్టుకున్నారు. వివేకా హత్య కేసులో తనను కొందరు బలవంతంగా కొంత మంది పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని లేఖలో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టత లేదు.
ఇప్పుడు కోర్టు ఆదేశాలతో సీబీఐ ఎస్పీ రాం సింగ్‌పై కేసు నమోదయింది. తదుపరి ఏం చర్యలు తీసుకుంటారన్నదానిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ సీబీఐ ఎస్పీని లోకల్ పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.