Adilabad News : అతని చొక్కానే మద్యం దుకాణం - ఆదిలాబాద్ జిల్లాలో స్మగ్లర్ తెలివితేటలు !
Crime News: ఆదిలాబాద్ జిల్లాలో ఓ నాటు సారా స్మగ్లర్ ను పోలీసులు అరెస్టు చేశారు.అతను చొక్కా జేబు అంతటా జేబులు కుట్టించుకుని మద్యం స్మగ్లింగ్ చేస్తున్నాడు.

Adilabad Crime : సినిమాల్లో టెర్రరిస్టులు మానవబాంబులు చొక్కాలకు పెట్టుకుని వస్తారు. పేల్చుకునే ముందు ఓ సారి షర్టు తీసి చూపిస్తారు. ఈ సీన్లు చూసి ఇన్ స్పయిర్ అయి.. అలా చేసుకుని అన్ని చోట్లా మద్యం పెట్టుకోవచ్చని ఫీలయ్యారేమో కానీ.. ఆదిలాబాద్ లోని నాటు సారా తయారీ దారులు అదే పని చేశారు. చొక్కాలకు చుట్టూ జేబులు కుట్టించి వాటి నిండా మద్యం బాటిళ్లు పట్టేలా చేసి.. కాలి నడకన ఎవరికీ తెలియకుండా.. స్మగ్లింగ్ చేసేస్తున్నారు. కానీ ఎక్కడో చోట దొరికిపోవాల్సిందేనని వారికి తెలియదు. ఓ సారి పోలీసులకు అనుమానం వచ్చి.. తేడాగా ఉందని చొక్క విప్పిస్తే.. మొత్తం గుట్టు బయటపడింది.
అదిలాబాద్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రెండ్ల విజేందర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పెండల్ వాడ గ్రామానికి చెందిన అశోక్, రూరల్ మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన కాకేర్ల అరుణ్, తాంసి మండలం లింగుగూడకు చెందిన టేకం రజిత అక్రమంగా దేశీదారు మద్యం అమ్ముతుండగా 140 దేశిదారు సీసాలు పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. ఇందులో ముఖ్యంగా కాకేర్ల అరుణ్ ఎవరికి అనుమానం రాకుండా చుక్క లోపల సీసాలు పెట్టేందుకు ప్రత్యేకంగా లోపలి భాగంలో ఒక చొక్కా ధరించి అందులో దేశిదారు సీసాలను పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నారు.
యధావిధిగా అందరిలానే ఓ చొక్కా ధరించి వస్తున్నారని పోలీసులు అనుకున్నారు. ఆ ప్రాంతం మహారాష్ట్ర సరిహద్దు కావడంతో దేశి దారు మద్యం మహారాష్ట్ర నుండి తీసుకొచ్చి ఆదిలాబాద్ సరిహద్దు గ్రామాల్లో విక్రయిస్తున్నాడు. ఆయన చేసే అక్రమ రవాణా చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. చొక్కా లోపల సీసాలు పెట్టి అనుమానం రాకుండా ఇలా దేశిదారును విక్రయించడంతో.. తమ ఎక్సైజ్ శాఖ సిబ్బందికి సమాచారం అందడంతో చాకచక్యంగా వ్యవహరించి అతడిని పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుండి 32 దేశీదారు సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
పట్టుకున్న ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో అక్రమంగా మద్యం అమ్మిన విక్రయించిన చట్టరీత్యా నేరమని ఎవరైనా ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎక్సైజ్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున అక్రమ మద్యం ఆదిలాబాద్ జిల్లాలోకి వస్తుంది. ఇప్పుడు పట్టుబడిన వారు చాలా చిన్న వాళ్లని.. అసలు స్మగ్లింగ్ చేసేవాళ్లు వేరే వారు ఉంటారన్న అభిప్రాయాలు అక్కడి ప్రజల నుంచి వసున్నాయి .





















