Nizamabad Crime : నిజామాబాద్ లో రెచ్చిపోతున్న కేటుగాళ్లు, ఒంటరి మహిళలే టార్గెట్!
Nizamabad Crime : నిజామాబాద్ లో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా హత్యలకు పాల్పడి విలువైన ఆభరణాలు దోచుకుపోతున్నారు.
Nizamabad Crime : నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకీ క్రైంరేటు పెరిగిపోతోంది. చైన్ స్నాచింగ్ మొదలుకుని, టూవిల్లర్స్ దొంగతనాలు, ఆన్ లైన్ మోసాలు ఇలా ఒక్కటేమిటి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా వదట్లేదు కేటుగాళ్లు. తాజాగా వెలుగుచూసిన ఘనటలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో ఓ ఘరానా హంతకుడు ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ... చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నాడు. ఒంటిగా వెళ్తున్న మహిళలను రాడుతో హతమార్చి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరిస్తున్నాడు. నిజామాబాద్ నగరంలోని నాగారానికి చెందిన ఘరానా హంతకుడు జిల్లాలో ఏడుగురు మహిళలను ఇలా హతమార్చాడు. తులాల కొద్ది బంగారం దోచుకొని తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు మాక్లూర్ లో జరిగిన హత్య కేసులో ఈ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. ఇతనిపై గతంలోనూ వివిధ జిల్లాల్లో పదికి పైగా దొంగతనాల కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది.
ఆరు హత్యలు
నగర శివారులోని ఐదో టౌన్ పరిధిలో నాగారానికి చెందిన వ్యక్తి గత కొంతకాలంగా నేరాలకు అలవాటుపడ్డాడు. నగరంలో అడపాదడపా చోరీలు చేసిన ఇతడు సిరిసిల్ల, దుబ్బాక, సిద్దిపేట్లోనూ వాహనాలు, సెల్ఫోన్లు దొంగతనాలు చేశాడు. చోరీ సొత్తును అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. మాక్లూర్ మండలం డీకంపల్లి సమీపంలో ఓ మహిళను నిందితుడు మరో వ్యక్తితో కలిసి హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగల్ని అపహరించుకెళ్లారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలు, టవర్ డంప్ సాయంతో నిందితుడి వివరాలు రాబట్టి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. ఇప్పటి వరకు ఆరుకు పైగా హత్యలు చేసినట్లుగా ప్రాథమికంగా తెలిసింది. ఇతని చోరీలపైనా పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
ఆన్ లైన్ మోసాలు
తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ అమ్ముతానని చెప్పిన మాటల వలలో పడి ఓ యువకుడు మోసపోయిన ఘటన ధర్పల్లిలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన చింతనాల్ల ప్రసాద్ ఈనెల 10న ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ ఫ్లాట్ ఫాంలో రషీద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ అమ్ముతానని చెప్పడంతో బాధితుడు నమ్మి ఫోన్ పే ద్వారా రూ. లక్ష పంపించారు. చివరికి ఫోన్ డెలివరీ అయిన తర్వాత నకిలీ ఫోన్ గుర్తించిన బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. బాధితుడు ఫిర్యాదుతో సైబర్ హెల్ప్ లైన్ నంబర్ ద్వారా అమౌంట్ ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెచ్చిపోతున్న బైక్ దొంగలు
కమిషనరేట్ పరిధిలో మూడు నెలల్లో 92 టూవిల్లర్స్ మాయమయ్యాయి. అంటే రోజుకొకటి చొప్పున చోరీకి గురవుతున్నాయ్. ఇందులో జిల్లా కేంద్రంలోనే 60కి పైగా చోరీ అయ్యాయి. అయితే పోలీసులు ఈ కేసులను చాలా సులువుగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించినా సరైన స్పందన ఉండట్లేదన్న ఆరోపణలు వస్తున్నాయ్. బైక్ కోసం వెతికి దొరక్కపోతే నాలుగైదు రోజుల తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్ కు రావాలంటున్నారని బాధితులు చెబుతున్నారు. అప్పటికే నిందితులు వాటిని జిల్లా నుంచి దాటించేస్తున్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండట్లేదు.
పాత ముఠాల పనేనా
ఇలాంటి కేసులు పెరగడంపై పలు పోలీస్ స్టేషన్లలో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. మహారాష్ట్రకు చెందిన పాత ముఠాల పనిగా భావిస్తున్నారు. గతంలో జిల్లాలోనూ వరుసగా దొంగతనాలకు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కారు. వీరిని పట్టుకొనేందుకు ఐడీ పార్టీ సిబ్బంది నిఘా ఉంచినట్లు చెబుతున్నారు. నిజామాబాద్ లో బైక్ దొంగతనాలు ఎక్కువయ్యాయి. ప్రత్యేకంగా పలు ముఠాలు వరుసగా టూవీల్లర్స్ చోరీ చేస్తున్నారు. ఆసుపత్రులు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలు, ఇంటి ఎదుట నిలిపి ఉంచిన బైక్ లను క్షణాల్లో మాయం చేసేస్తున్నాయి. ఫిర్యాదు ఇవ్వడానికి బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్తే రోజుల తరబడి కాలయాపన జరుగుతోంది. సీసీ పుటేజీలు ఉంటున్నా నిందితులు మాత్రం చిక్కట్లేదు. ఇలా చోరీ చేసిన బైక్ లను మహారాష్ట్రకు తరలించేస్తున్నారు. ఇటీవల ఓ బైక్ చోరీ జరిగింది. హైదరాబాద్ లో ఆ బైక్ కలర్ మార్చేశారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించటంతో బైక్ హోల్డర్ కు చలానా మెసేజ్ వచ్చింది. ఈ విషయాన్ని బాధితుడు పోలీసులకు తెలిపారు. పోలీసులు ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇటీవల నిజామాబాద్ లో పెరిగుతున్న నేరాలను పోలీసులు నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు నగరవాసులు.