Nellore: నెల్లూరులో లిక్కర్ గొడవ, ఇద్దరిని నరికేసిన ఆటో డ్రైవర్
మద్యం కోసం జరిగిన గొడవలో ఇద్దరిని మరో వ్యక్తి కత్తితో పొడిచి చంపిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం కోసం జరిగిన గొడవతోనే ఈ హత్యలు జరిగినట్టు తెలిపారు నెల్లూరు జిల్లా డీఎస్పీ హిమవతి.
Nellore Murder Case: చిన్న చిన్న కారణాలతోనే ఇటీవల నెల్లూరులో హత్యలు జరుగుతున్నాయి. హోటల్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు డబ్బుల కోసం యజమాని దంపతులనే పొట్టన పెట్టుకున్నారు. తాజాగా మద్యం కోసం జరిగిన గొడవలో ఇద్దరిని మరో వ్యక్తి కత్తితో పొడిచి చంపిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం కోసం జరిగిన గొడవతోనే ఈ హత్యలు జరిగినట్టు తెలిపారు నెల్లూరు జిల్లా డీఎస్పీ హిమవతి.
మద్యం షాపు దగ్గర మొదలైన గొడవ..
నెల్లూరు నగరం (Nellore City) పొదలకూరు (Podalakuru Road) రోడ్డులోని టైలర్స్ కాలనీకి చెందిన ఆకుల రమణా రెడ్డి (60), నిర్మలా నగర్‌కు చెందిన ముసునూరు శ్రీకాంత్ (35) ఇద్దరూ స్నేహితులు. వరిద్దరూ బేల్దారి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నెల పదో తేదీ రాత్రి రమణా రెడ్డి తెలుగు గంగ కాలనీ సమీపంలోని మద్యం దుకాణానికి వెళ్లాడు. అప్పటికే దుకాణం మూసివేసే టైమ్ అయింది. అంతకు ముందే ఆ షాపు వద్దకు కొత్తూరు చవట మిట్టకు చెందిన ఆటో డ్రైవరు షేక్ రఫీ కూడా వచ్చాడు. మద్యం ఇవ్వడం కుదరదని షాపు నిర్వాహకులు చెప్పడంతో రఫీ వారితో గొడవ పడ్డాడు. అంతలో రమణా రెడ్డి కూడా మద్యం కావాలని అడగడంతో, షాపు నిర్వహకులు ఇద్దర్నీ తిప్పి పంపించేశారు. మద్యం దొరకలేదన్న కోపంతో రఫీ, రమణా రెడ్డితో గొడవ పడ్డాడు. అక్కడితో ఆ సీన్ అయిపోయింది.
రఫీపై దాడి చేయబోయి
ఆ తర్వాత రమణా రెడ్డి ఈ విషయాన్ని తన స్నేహితుడు శ్రీకాంత్ కు చెప్పాడు. ఆ తర్వాతి రోజు మద్యం దుకాణం ఎదురు సందులో వీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అంతలోనే రఫీ అటువైపు ఆటోలో వచ్చాడు. దీంతో రమణారెడ్డి, శ్రీకాంత్ ఒక్కసారిగా రఫీపై దాడికి ప్రయత్నించారు. కానీ వీరిద్దరూ అనుకున్నది జరగలేదు, ఆటో డ్రైవర్ రఫీ వారిపై తిరగబడ్డాడు. కత్తితో రఫీ వారిద్దర్నీ పొడిచాడు. స్పాట్ లోనే రమణా రెడ్డి చనిపోయాడు. శ్రీకాంత్ ని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ శ్రీకాంత్ చనిపోయాడు.
ఈ సమాచారం అందుకున్న వేదాయపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు రఫీని వెతికి పట్టుకున్నారు. రఫీపై హత్య, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు ఏఎస్పీ హిమవతి. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు పారిపోయిన రఫీ, తన సెల్ ఫోన్ కూడా మార్చేశాడు. సిమ్ లు మార్చి ఏమార్చాలని చూశాడు. చివరకు గొలగమూడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులకు రఫీ చిక్కాడు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు రఫీ నడుపుతున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల కాలంలో నెల్లూరులో (Nellore News) వరుసగా రెండుసార్లు జంట హత్యలు జరిగాయి. ఈ రెండు జంట హత్యలను కూడా పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.