Crime News: ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా పేలిన మొబైల్! యువకుడు చనిపోవడంతో విషాదం
Hyderabad Crime News | మొబైల్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఒక్కసారిగా పేలిపోయింది. షార్ట్ సర్క్యూట్ అయి రూమ్ మొత్తం మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో యువకుడు మృతిచెందాడు.

Cellphone Explosion while Charging In Hyderabad | కుత్బుల్లాపూర్: మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ బస్తీలో ఓ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. గుడికి వెళ్లిన తల్లితండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి రూమ్ అంతా మంటల్లో కాలిపోయి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా సెల్ ఫోన్ పేలిపోయిందని స్థానికులు, పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. దాంతో కొంత సమయానికే రూమ్ అంత అగ్నికి ఆహుతి అయింది. అసలే ఫోన్ పేలడంతో తీవ్ర గాయాలపాలైన సాయి అనే 27 ఏళ్ల యువకుడు గదిలో పడిపోయాడు. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడంతో యువకుడి శరీరం కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ గదిలోని అన్ని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.
ఇంట్లో ఎవరు లేని సమయంలో జరగడంతో అనుమానం
చేతికి అందివచ్చాడనుకున్న కొడుకు చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గుడికి వెళ్లొచ్చేసరికి ఊహించని ఘటన జరగడంతో తల్లిదండ్రులు షాకయ్యారు. బంగారం లాంటి కొడుకు ఇలా అర్ధాంతరంగా చనిపోయాడు, మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోయాడంటూ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. వారిని ఓదార్చడం స్థానికుల వల్ల కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన జరగడంతో దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, అధికారులు యువతకు సూచిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఫోన్లో మాట్లాడకూడదని చెబుతారు. ఛార్జింగ్ సైతం 100 శాతం వరకు అవసరం లేదని, 90, 95 శాతం బ్యాటరీ పూర్తికాగానే ఛార్జింగ్ తీసేయాలని సూచిస్తుంటారు. అనుకోని ప్రమాదాలతో ఏదైనా ప్రాణ నష్టం జరిగితే, దాన్ని ఎవరూ పూడ్చలేరు.






















