Hyderabad Crime News: గోవాలో హనీమూన్ ప్లాన్.. రైలు ఎక్కే ప్రయత్నంలో విషాదం, కొత్త పెళ్లికొడుకు మృతి
Honeymoon Crime News | గోవాలో హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. టికెట్లు బుక్ చేసుకున్న జంట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కానీ దురదృష్టవశాత్తూ కొత్త పెళ్లికొడుకు మృతిచెందాడు.

హైదరాబాద్: ఆ యువతి, యువకుడికి మూడు నెలల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కొత్త జంట హనీమూన్ కు గోవాకు బయలుదేరగా విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ రైలు కింద పడి, గాయపడిన యువకుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌లో శుక్రవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది.
గోవాలో హనీమూన్ ప్లాన్..
వరంగల్ కు చెందిన ఉరగొండ రమేష్ కుమారుడు ఉరగొండ సాయి వయసు 28 ఏళ్ళు. అతడు గిఫ్ట్ ఆర్టికల్స్ తయారీ షాపులో సాయి పని చేస్తున్నాడు. మూడు నెలల కిందట సాయికి వివాహమైంది. పెద్దల సమక్షంలో వేడుకగా పెళ్లి జరిగింది. ఈ క్రమంలో మూడు నెలల తరువాత హనీమూన్ కు గోవాకు వెళ్లాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. తమ ట్రిప్ కోసం టికెట్లు సైతం బుక్ చేసుకున్నారు. వీరి వెంట కొందరు కుటుంబ సభ్యులు స్నేహితులు సైతం గోవా ప్లాన్ చేశారు.
జూన్ 6న (శుక్రవారం) ఉదయం తన భార్య బావమరిది, స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లేందుకు ఉరగొండ సాయి రైల్వే స్టేషన్ కు సాయి చేరుకున్నాడు. 9 నెంబర్ ప్లాట్‌ఫాం మాద ఉన్న గోవా వెళ్లే వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. రైలు బయలుదేరడానికి కొంత సమయం ఉందని భావించిన సాయి వాటర్ బాటిల్ కొనేందుకు రైలు దిగాడు. అంతలోనే వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరడంతో స్నేహితులు కంపార్ట్మెంట్లో చైన్ లాగగా రైలు ఆగింది. వెంటనే ఆర్పిఎఫ్ పోలీసులు ఆ భోగిలోకి వెళ్లి ఏం జరిగిందని ప్రశ్నించారు. సాయి ఫ్రెండ్స్ ని ఆర్పిఎఫ్ పోలీసులు ప్లాట్ఫామ్ మీదకి తీసుకువచ్చారు.
మరోవైపు రైలు ఎక్కిన సాయి విషయం తెలుసుకుని తిరిగి ప్లాట్‌ఫాం మీదకి వచ్చాడు. జరిగిన తప్పిదానికి తాము ఫైన్ చెల్లిస్తామని సాయి, అతడి స్నేహితులు ఆర్పిఎఫ్ పోలీసులను కోరారు. అందులోనే రైలు తిరిగి బయలుదేరడంతో అందులో తన భార్య ఇద్దరు స్నేహితులు ఉన్నారని త్వరగా రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన సాయి ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్ ఫామ్ మధ్యలో పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన సాయిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కొన్ని గంటల్లోనే అతడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహమైన మూడు నెలలకు హనీమూన్ కోసం గోవాకు బయలుదేరుతుండగా కొత్త పెళ్లికొడుకు చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.






















