(Source: ECI/ABP News/ABP Majha)
Mahabubnagar: మూడు గంటల్లో పెళ్లి, ఇంతలో వరుడు మృతి, పెళ్లికి తెచ్చిన దండలు చావుకు!
కాసేపట్లో పెళ్లి ముహూర్తం అనగా వరుడు చనిపోయాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొనడం వల్ల అక్కడికక్కడే మరణించాడు.
ఇంకో మూడు గంటల్లో పెళ్లి. ఇంతలోనే ఘోరమైన విషాదం చోటు చేసుకుంది. ముహూర్తానికి ముందు వరుడు చనిపోయాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొనడం వల్ల అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం ఉదయం జడ్చర్ల–మహబూబ్‌నగర్ 167వ నం బరు జాతీయ రహదారిపై ఘటన చోటు చేసుకుంది.
జడ్చర్ల పోలీసులు దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ పట్టణంలో స్థానిక క్రిస్టియన్ కాలనీలో నివాసం ఉండే చైతన్య శామ్యూల్ (34)ఉంటున్నాడు. ఇతను కొన్నేళ్లుగా నారాయణ పేట జిల్లాలోని తిర్మలాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతనితో వనపర్తి పట్టణానికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. గురువారం ఉదయం 11.30 గంటలకు మహబూబ్‌నగర్ కల్వరీ చర్చిలో పెళ్లి జరగాల్సి ఉంది. ఆ వెంటనే మధ్యాహ్నం పక్కనే ఉన్న సుదర్శన్ ఫంక్షన్ హాల్‌లో విందు కూడా ఏర్పాట్లు చేశారు. ఆ హాలులోనే వధువు తరపు కుటుంబం, బంధువులు అందరూ విడిది చేశారు.
గురువారం ఉదయం 11 గంటలకు చర్చిలో జరగాల్సిన పెళ్లికి ఓ వైపు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు పెళ్లి కుమారుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కారులో జడ్చర్లకు బయలుదేరాడు. మధ్యలో నక్కలబండ తండా గ్రామం మలుపు వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో తల, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఉన్న ఒక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పెళ్లి వేడుకల్లో ఆనందంగా ఉన్న కుటుంబ సభ్యులు వరుడు చైతన్య మరణ వార్త తెలియడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. పెళ్లి కోసం తీసుకొచ్చిన పూల దండలను మృతదేహానికి వేయాల్సి వస్తుందని అనుకోలేదని బంధువులు, అతిథులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు కుటుంబాల్లోనూ తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి.