Krishna News: మున్నేరులో విద్యార్థుల గల్లంతు విషాదాంతం... ఐదుగురి మృతదేహాలు లభ్యం
కృష్ణా జిల్లాలోని మున్నేరులో విద్యార్థుల గల్లంతు విషాదాంతమైంది. ఐదుగురి విద్యార్థుల మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీశారు.
కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం మున్నేరులో విద్యార్థుల గల్లంతు విషాదాంతమైంది. జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరు వద్ద మున్నేరులో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఐదుగురు విద్యార్థులూ విగతజీవులుగా మారారు. మాగులూరి సన్నీ (12), కర్ల బాలయేసు (12), జెట్టి అజయ్ (12), మైలా రాకేష్ (11), గురజాల చరణ్ (14) నిన్న వారి గ్రామం సమీపంలోని మున్నేరులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. విద్యార్థుల ఆచూకీ కోసం సోమవారం సాయంత్రం నుంచి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం ఆ ఐదుగురి విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది రాత్రంతా గాలింపు చేపట్టారు. ఈతకు వెళ్లిన పిల్లలు విగతజీవులగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా శోకిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Also Read: కృష్ణా జిల్లా ఏటూరు మున్నేరు ప్రాంతంలో ఐదుగురు పిల్లలు గల్లంతు....!
అసలేం జరిగింది..?
చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ పరిసరాల్లో ఉన్న మున్నేరులో సోమవారం స్నానం చేయడానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఏటూరు గ్రామానికి చెందిన చరణ్, బాల యేసు, అజయ్, రాజేష్, సన్నీలు సంక్రాంతి సెలవులు రావడంతో సరదాగా ఈత కొట్టేందుకు కృష్ణానదిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థులు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కృష్ణా నది వైపు వెళ్లారని తల్లిదండ్రులకు స్థానికులు తెలపడంతో విద్యార్థులు కృష్ణా నదిలో దిగినట్లు గుర్తించి పోలీస్ రెవెన్యూ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి విద్యార్థులు ఎక్కడ ఉన్నారనే దానిపై గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విద్యార్థులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్లు తెలిసింది. గల్లంతైన వారు చరణ్ , బాల యేసు(13), అజయ్, రాకేష్ , సన్నీగా గుర్తించారు. పిల్లల బట్టలు, వారి సైకిళ్లు మున్నేరు ఒడ్డున ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు.
Also Read: కన్న బిడ్డల్ని బావిలోకి నెట్టేసిన సీఆర్పీఎఫ్ జవాను! వెంటనే పరారీ.. కారణం ఏంటంటే..
Also Read: అరె ఏంట్రా ఇది.. లోన్ రిజెక్ట్ చేశారని ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు, అంతా బూడిదే