Madhapur Car Accident: మాదాపూర్ లో అర్ధరాత్రి కారు బీభత్సం, ఇద్దరికి తీవ్ర గాయాలు! వినాయక వేడుకల్లో విషాదం
Madhapur Car Accident: హైదరాబాద్ లోని మాదాపూర్ లో శుక్రవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.
Madhapur Car Accident: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన ఓ కారు హైటెక్ సిటీ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు కారులో ఉన్న యువతి, యువకుడిని బయటకు తీశారు. సమాచారం అందికున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో యువతి కారు నడుపుతున్నట్లు, ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
వేగంగా వెళ్తున్న వ్యానుకు స్కూటీ రావడంతో.. (Nellore Road Accident)
నెల్లూరు నుంచి ముత్తుకూరుకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో వెళ్తున్న వ్యాను ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వ్యానులోని ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్రగాయాలు కాగా మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరంతా ముత్తుకూరు మండలం ఈపురు వెంకన్నపాలెం స్కూల్ కాంప్లెక్స్ పరిధి పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు. ఇదిలా ఉంటే వ్యాను బోల్తా పడ్డ సమయంలో ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి తీవ్రగాయాలు కాగా అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
వేగంగా వెళుతున్న వ్యానుకు అడ్డంగా ఒక స్కూటీ అకస్మాత్తుగా రావడంతో డ్రైవర్ తప్పించబోయే క్రమంలో పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొని అవతలి రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన బైక్ పై వ్యాను పడింది. బైక్ నుజ్జు నుజ్జు కాగా, దానిపై ప్రయాణిస్తున్న ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు హుటాహుటీన గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
వినాయక వేడుకల్లో విషాదం..
నెల్లూరు జిల్లాలో వినాయక చవితి (Ganesh Chaturthi 2022) వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఆత్మకూరు పట్టణంలోని బంగ్లా సెంటర్ వద్ద వినాయక చవితి వేడుకల్లో విషాద ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం ఎదుట ఉట్టి కొట్టే కార్యక్రమం చేపట్టగా సమీపంలో పురాతన భవనం పైకి స్థానికులు కొందరు ఎక్కి చూస్తూ ఉన్నారు. భక్తుల కేరింత నడుమ ఉట్టికొట్టే కార్యక్రమం జరుగుతూ ఉండగా ఒక్కసారిగా ఈ భవనం సన్ సైడ్ స్లాబ్ కూలిపోవడంతో దానిపైన ఉన్న వారిలో 20 మందికి గాయాలయ్యాయి. ఓ మహిళపై శిథిలాలు పడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్లాబ్ కూలిన సమయంలో దానిపై సుమారు 30 మంది వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన సుమారు 20 మందిని స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్ తరలించగా అందులో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె నెల్లూరు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆత్మకూరు ఎస్ఐ శివశంకరరావు పరిస్థితిని పరిశీలించి వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.