Hyderabad Accident: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం, హుస్సేన్ సాగర్ రెయిలింగ్‌ను ఢీకొట్టి సగం కారు గాలిలోనే
Hyderabad Accident: హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం సృష్టించింది. హుస్సేన్ సాగర్ రెయిలింగ్ ను ఢీకొట్టింది.
Hyderabad Accident: హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఓ కారు బీభత్సం సృష్టించింది. ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ మార్గ్ లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్ రెయిలింగ్ ను ఢీకొట్టింది. కారు ఉన్న వేగానికి రెయిలింగ్ పడిపోయింది. దూసుకొచ్చిన కారు రెయిలింగ్ ను ఢీకొట్టి అక్కడే నిలిచి పోయింది. వెనక రెండు చక్రాలు ట్యాంక్ బండ్ పై ఉండగా.. ముందు ఉన్న రెండు చక్రాలు గాలిలో వేలాడాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.
ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ మార్గ్ లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఆ దారిలో వేగంగా దూసుకెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి హుస్సేన్ సాగర్ వైవు మళ్లింది. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లి, సాగర్ రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టింది. తృటిలో కారు సాగర్ లో పడిపోయేది కానీ రెయిలింగ్ వల్ల సగంలో ఆగిపోయింది. ఫుట్ పాత్ ను కారు ఢీకొట్టిన వెంటనే లోపల ఉన్న ఎయిర్ బ్యాగ్ తెరచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత వారిద్దరూ కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో అతి వేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గతంలో హుస్సేన్ సాగర్ లో పడిపోయిన కారు
గతంలో ఇదే మార్గంలో రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఆ ఘటనలో కారు హుస్సేన్ సాగర్ లో పడిపోయింది. ఖైరతాబాద్ కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్ లు ముగ్గురు అఫ్జల్ గంజ్ లో టిఫిన్ చేయడానికి బయల్దేరారు. ఎన్టీఆర్ మార్క్ వద్దకు రాగానే కొత్త కారు అదుపు తప్పింది. ఫుట్ పాత్ ను దాటుకుని హుస్సేన్ సాగర్ లో పడిపోయింది. కొత్త కారు కావడంతో ఎయిర్ బ్యాగ్ లు తెరచుకోవడం వల్ల కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరగడానికి కేవలం 4 రోజుల ముందే ఆ కారును కొనుగోలు చేశారు.
సాగర్ లో పడ్డ కారు
లుంబినీ పార్కు వద్ద గతంలో జరిగిన ప్రమాదంలో ఓ కారు హుస్సేన్ సాగర్ లో పడిపోయింది. కారు యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. గ్రిల్స్ ను రాసుకుంటూ వెళ్లి సాగర్ లో పడిపోయింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.
ఇటీవలే ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి కార్నర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆటోలో 9 మంది ఉండగా అందులో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృత దేహలు మొత్తం నుజ్జు నుజ్జుగా మారిపోయాయి. మిగతా ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడ్డ ఐదుగురిని అంబులెన్సులో అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీంద్ర నగర్ కాలనికి చెందిన వారిగా గుర్తించారు. ఇచ్చోడలోని ఓ చర్చిలో రాత్రంతా ప్రార్థనలు చేసుకోని ఉదయం నాలుగు గంటలకు ఆటోలో అదిలాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.