MBS Sukesh Gupta : ఈడీ కస్టడీకి ఎంబీఎస్ సుఖేష్ గుప్తా, 9 రోజులపాటు విచారణ
MBS Sukesh Gupta : ఎంబీఎస్ ఎండీ సుఖేష్ గుప్తాను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. 9 రోజుల పాటు ఈడీ ఆయనను విచారించనుంది.
MBS Sukesh Gupta : ఎంబీఎస్ అధినేత సుఖేష్ గుప్తాను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో ఎంబీఎస్ జ్యుయలరీ షాపుల్లో ఈడీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ చంచల్ గూడా జైల్లో ఉన్న గుప్తాను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని కార్యాలయానికి తరలించారు. తొమ్మిది రోజుల పాటు ఈడీ సుఖేష్ గుప్తాను విచారించనున్నారు. ఇటీవల రెండు రోజుల పాటు తనిఖీలు చేసి ఈడీ రూ. 150 కోట్ల బంగారపు ఆభరణాలు, రూ. 2 కోట్ల నగదు సీజ్ చేసింది. సుఖేష్ గుప్తా ఎంఎంటీసీ సంస్థకు రూ. 504 కోట్లు ఎగవేతకు పాల్పడ్డారు. శ్రేయి ఫైనాన్స్‌లో తీసుకున్న రుణాలతో పాటు ఎంఎంటీసీ నుంచి కొనుగోలు చేసిన బంగారంతో అమ్మకాలు జరిపి ఆ నగదు ఎక్కడికి తరలించారని ఈడీ ఆరా తీస్తుంది. అలాగే సుఖేష్ గుప్తా ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ఎగవేతపై కూడా అధికారులు ఆరా తీయనున్నారు. శ్రేయి ఫైనాన్స్‌లో సుఖేష్ గుప్తా రూ. 110 కోట్ల రుణాలు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పేరుతో ఫైనాన్స్ సంస్థలో గుప్తా రుణాలు తీసుకున్నారు.
Enforcement Directorate arrested MBS Jewellers, Musaddilal Gems & Jewels and director Sukesh Gupta, seized jewellery stocks of Rs.149.10 Cr and Cash of Rs. 1.96 Cr in the MMTC scam. ED initiated an investigation based on CBI FIR in the 504.34 Cr scam.#Hyderabad pic.twitter.com/yK1qt0BPUk
— Ashish (@KP_Aashish) October 20, 2022
ఈడీ కస్టడీకి సుఖేష్ గుప్తా
ఇటీవల హైదరాబాద్, విజయవాడలోని ఎంబీఎస్ షోరూమ్స్ లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో హైదరాబాద్ లోని ఎంబీఎస్, ముసద్దీలాల్ జేమ్స్ జ్యువెల్లరీ షోరూమ్ లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో రూ.100 కోట్లకు పైగా విలువైన బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. సుఖేష్ గుప్తా , అనురాగ్ గుప్తా బినామీల వద్ద సుమారు రూ.50 కోట్ల విలువైన ప్రాపర్టీని అధికారులు గుర్తించారు. తనిఖీల అనంతరం వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత విచారణకు ఈడీ అధికారులు ఎంబీఎస్ జ్యుయలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను ఇవాళ కస్టడీకి తీసుకున్నారు. తొమ్మిది రోజుల పాటు సుఖేష్ గుప్తాను విచారించేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. నేటి నుంచి నవంబర్ 2వ తేదీ వరకు సుఖేష్ గుప్తాను ఈడీ విచారిస్తుంది.
భారీగా బంగారం సీజ్
సుఖేష్ గుప్తా ఎంఎంటీసీ సంస్థ నుంచి రూ.504 కోట్ల విలువైన బంగారాన్ని క్రెడిట్ రూపంలో తీసుకున్నారు. ఈ లావాదేవీకి సంబంధించి ఆయన నగదు చెల్లించలేదు. ఎంఎంటీసీ సంస్థ ఫిర్యాదుతో 2013లో ఎంబీఎస్ సంస్థ ఎండీ సుఖేష్ గుప్తాపై ఈడీ కేసు నమోదు చేసింది. 2014లో ఈడీ అధికారులు ఛార్జిషీట్ ఫైల్ చేశారు. అయితే సుఖేష్ గుప్తా ఆరు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో తప్పుడు పత్రాలు సృష్టించి భారీగా నగదు మార్పిడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. సుఖేష్ గుప్తా గతంలో కూడా అరెస్ట్ అయ్యారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదని ఈడీ అధికారులు అంటున్నారు.
ఫెమా, పీఎంఎల్ఏ యాక్ట్
సుకేశ్ గుప్తాపై ఫెమా, పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గతంలోనూ సీబీఐ సుఖేశ్ గుప్తాను అరెస్ట్ చేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఫేక్ ఇన్వాయిస్ సృష్టించి భారీ మోసాలకు పాల్పడ్డట్లు సీబీఐ గుర్తించింది. తాను రూ.110 కోట్ల రుణం తీసుకున్నానని.. రూ. 130 కోట్లు తిరిగి చెల్లించానని సుఖేష్ గుప్తా తెలిపారు. అయినా మనీ లాండరింగ్ అంటూ తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు.