Hyderabad Husband Kills Wife: హైదరాబాద్‌లో దారుణం.. భార్యను దారుణంగా హత్య చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త
Borabanda Crime News | హైదరాబాద్‌లోని బోరబండలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను హత్య చేసి, తరువాత ఈ విషయాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు.

Hyderabd Crime News | అగ్ని సాక్షిగా తాళి కట్టి ఎన్నో ప్రమాణాలు చేశాడు. కానీ పిల్లలు, కుటుంబ బాధ్యతను పట్టించుకోకుండా ఖాళీగా ఉంటున్నాడు. ప్రస్తుతం భార్య సంపాదనతోనే ఆ ఇల్లు గడుస్తోంది. అంత చేస్తున్నప్పటికీ అనుమానంతో భార్య ప్రాణం తీసేశాడు. చేసింది దారుణమైన తప్పిదం.. పైగా భార్యను హత్య చేసిన తరువాత ప్రశాంతంగా ఇంటి నుంచి బయటకు వెళ్లి నా చేతులారా చంపుకున్నాను అని వాట్సాప్ స్టేటస్ పెట్టడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.
నమ్మించి పుట్టించి నుంచి తీసుకొచ్చిన భర్త
హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే ఆంజనేయులు అనే వ్యక్తి, తన భార్య సరస్వతి (34) ప్రవర్తనపై అనుమానం పెంచుకుని ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. రాజీవ్‌గాంధీ నగర్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వనపర్తి జిల్లాకు చెందిన వీరిద్దరికీ 2013లో వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారు డ్రైవర్‌గా పనిచేసే ఆంజనేయులు ఏ పని చేయకుండా ఖాళీగా రోడ్లపై తిరుగుతూ, అనుమానం పెంచుకుని తన భార్యను వేధించేవాడు. ఓ ఐటీ కంపెనీలో హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ సరస్వతీ కుటుంబాన్ని పోషిస్తోంది. కానీ భర్త చేష్టలకు విసిగిపోయిన సరస్వతి ఇటీవల పుట్టింటికి వెళ్ళింది. తాను మారిపోతానంటూ నమ్మించి బతిమిలాడి మరీ జనవరి 17న భార్యను ఇంటికి తీసుకొచ్చాడు నిందితుడు ఆంజనేయులు.
సోమవారం రాత్రి భార్య నిద్రిస్తున్న సమయంలో ఆంజనేయులు రోకలిబండతో ఆమె తలపై బలంగా బాదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆ సమయంలో పక్కనే నిద్రిస్తున్న పిల్లలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. మీ అమ్మ పడుకుంది.. మీరు కూడా నిద్రపోండి అని నమ్మించిన తండ్రి ఆంజనేయులు అక్కడి నుంచి పరారయ్యాడు. పిల్లలు లేచి చూసేసరికి తల్లిలో చలనం లేదు. రక్తపు మడుగులో పడి ఉండటం చూసి భయాందోళనకు గురైన పిల్లలు మేనమామ సుధాకర్‌కు, బంధువులకు సమాచారం అందించారు. పిల్లల మేనమామ 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు.
హత్య చేసి వాట్సాప్ స్టేటస్..
ఈ హత్య కేసులో మరింత దారుణమైన విషయం ఏమిటంటే.. హత్య చేసిన అనంతరం నిందితుడు ఇంటి నుంచి వెళ్లపోయిన తన మొబైల్ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. జీవితంలో సగభాగమైన నిన్ను నా చేతులారా చంపుకున్నాను అని స్టేటస్ పెట్టడం చూసి పోలీసులు సైతం షాకయ్యారు. నిందితుడు ఆంజనేయులు గతంలో తన బావమరిది (సరస్వతీ మరో సోదరుడు)పై కూడా కత్తితో దాడి చేశాడు. సరస్వతీ సోదరుడు సుధాకర్ ఫిర్యాదుతో బోరబండ పోలీసులు ఆంజనేయులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడ్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు పోలీసులు.






















