(Source: ECI/ABP News/ABP Majha)
Loan Apps News: నందిగామ యువతి సూసైడ్ అసలు కారణం ఇదే, తేల్చిన పోలీసులు
Loan App Suicides: హరిత వర్షిని తండ్రి ప్రభాకర్ రావు రెండు క్రెడిట్ కార్డుల ద్వారా రూ.6,35,000 నగదు లోన్ తీసుకున్నట్లుగా పోలీసుల విచారణలో గుర్తించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంచలనం సృష్టించిన విద్యార్దిని హరిత వర్షిణి కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. లోన్ యాప్ లో రుణం పొందిన హరిత వర్షిణి తండ్రిని రికవరి ఎజెంట్లు ఇంటికి వచ్చి మరీ, అనరాని మాటలు అనటంతో అవమాన భారంగా భావించి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్దారించారు. ఏడుగురు రికవరీ ఏజెంట్ లను అరెస్టు చేశారు. వారిలో పవన్ కుమార్, భాగ్య తేజ, వెంకట శివ నాగరాజు, శ్రీనివాస రావు, ముని ధర్ రెడ్డి, మాధురి, వెంకటేశ్వరరావు ఉన్నట్లుగా డీసీపీ మేరి ప్రశాంతి వెల్లడించారు.
హరిత వర్షిని తండ్రి ప్రభాకర్ రావు రెండు క్రెడిట్ కార్డుల ద్వారా రూ.6,35,000 నగదు లోన్ తీసుకున్నట్లుగా పోలీసుల విచారణలో గుర్తించారు. గత నెల 26వ తేదీన మొదటిసారి ఇద్దరు వ్యక్తులు, రెండోసారి ఇద్దరు వ్యక్తులు ప్రభాకర్ ఇంటికెళ్లిన లోన్ రికవరీపై వేధించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించిన రికవరీ ఏజెంట్లు, హరిత వర్షిణిని చూస్తూ వెకిలిగా వ్యవహరించారు. అంతటితో ఆగలేదు. తీవ్రమైన పదజాలంతో దూషించారు. ఆ తరువాత మనస్తాపం చెందిన హరిత ఆత్మహత్య చేసుంది. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పరీక్షల్లో ర్యాంక్ రాలేదని ఆత్మహత్య చేసుకున్నానని చెప్పమని కుటుంబ సభ్యులకు చెప్పి మరి హరిత ఆత్మహత్యకు పాల్పడింది.
ఆర్థిక ఇబ్బందుల వల్ల స్కూల్ ఫీజు కట్టలేక, తన కుటుంబం ఉండడంతో సూసైడ్ నోట్ రాసి వంటగదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తరువాత ఆమె సూసైడ్ నోట్ వెలుగులోకి రావటంతో ఘటన సంచలనం అయ్యింది.
రంగంలోకి పోలీసులు
ఈ వ్యవహరంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసును ఆధారంగా చేసుకొని మిగిలిన బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించటంతో ప్రత్యేక విచారణ చేపట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. అవసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ బ్యాంకులు, ఇష్టానుసారంగా రుణాలు ఇస్తామంటూ ఆశ చూపిస్తున్నారు. ఆ తరువాత కట్టలేని పరిస్థితులు రావటంతో, రికవరి ఏజెంట్ ల పేరుతో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దారుణాలకు ఒడిగడుతున్నారు.
అయితే చాలా వరకు కుటుంబాలు పరువు పోతుందనే భయంతో విషయం బయటకు చెప్పటం లేదు. విద్యార్దిని మరణం, తరువాత సూసైడ్ నోట్ వెలుగులోకి రావటంతో ఈ సంఘటనతో జరుగుతున్న దురాగతాలు బయటకు వస్తున్నాయి.
ఏజెంట్‌లు, మేనేజర్లు కలిసి రికవరికి అడ్డదారులు
కోట్లాది రూపాయలను బినామీల పేరుతో లోన్లు తీసుకొని చెల్లించని బడాబాబులు వారి వద్ద లక్షలాది రూపాయలు కమిషన్ తీసుకునే బ్యాంకు సిబ్బంది, సామాన్యులపై ఇలాంటి దారుణాలకు ఒడి కట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకు అధికారులు కొంత మందిని తాత్కాలిక సిబ్బందిని నియమించి లోన్ తీసుకున్న వారి పట్ల అమానుషంగా, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడటం చేస్తున్నారు. ఫైనాన్సులు ఇచ్చిన సంస్థలు కొంతమంది యువకులను కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టి వారు కూడా ఇదే బాటన నడుస్తున్నారు. అవమానాలకు ఎంతో మంది కుటుంబీకులు గురయ్యి, ఊరి వదిలి వెళ్లిపోతున్నారు. మరికొందరు ఆత్మహత్యల వైపు వెళుతున్నారు. ఈ సంఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని బాధితులు కోరుతున్నారు.