HanumaKonda: హనుమకొండలో తుపాకీ కాల్పుల కలకలం, అత్తను చంపిన అల్లుడు
హనుమకొండలో తుపాకీ కాల్పుల కలకలం, అత్తను చంపిన అల్లుడు.
హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలోని ఇంద్ర కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలు కుటుంబ కలహాలతో అతను అల్లుడు కాల్చి చంపాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...
గుండ్ల సింగారానికి చెందిన రమాదేవికి, వరంగల్ జిల్లా కీర్తి నగర్ కు చెందిన ప్రసాద్ తో 25 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కుటుంబ కలహాలతో భార్య భర్తలు ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. అయితే పెద్దపల్లి జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్... తుపాకీని తీసుకొని గుండ్ల సింగారంలోని తన అత్తగారి ఇంటికి ఇవాళ వెళ్లాడు.
ఈ నేపథ్యంలో అత్త కమలమ్మ (56) ప్రసాద్ కు మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో కోపంలో తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కమలమ్మ ను కాల్చి చంపాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు గుర్తించారు.
కాగా, గతంలో తన అత్తకు రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చిన ప్రసాద్.. బుధవారం ఆమె ఇంటికి వచ్చాడు. డబ్బుల విషయమై అత్త, అల్లుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అత్తపై కాల్పులు జరిపి ఆమె మరణానికి కారణమైన ప్రసాద్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తోటపల్లి పోలీసు స్టేషన్లో పని చేస్తున్నాడు. అతడు కాల్పులు జరిపిన రివాల్వర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే దిశగా విచారణ జరుపుతున్నారు.
కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్‌పై కుటుంబ సభ్యులు దాడి చేశారు. కానిస్టేబుల్ ప్రసాద్ తలకు తీవ్ర గాయాలకు కాగా.. ఆసుప్రతికి తరలించారు. వెంటనే అతన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి మృతి చెందడంతో ప్రసాద్ భార్య రమాదేవి గుండెలు పగిలేలా ఏడ్చింది. గ్రామస్తులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ ప్రసాద్ ను ఎంజీఎంకు తరలించారు. ఆ తర్వాత కమలమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ కాల్పుల ఘటనపై డీసీపీ సైతం స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.