KPHB Car Accident: KPHBలో కారు బీభత్సం - మద్యం మత్తులో మాజీ మంత్రి మేనల్లుడి నిర్వాకం
Hyderabad News: కూకట్పల్లిలో ఓ మాల్ సర్కిల్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు మద్యం మత్తులో కారు నడిపి ఓ బైకర్ ను ఢీకొట్టాడు.
Ex Minister Nephew Hit Bike With Car in Intoxicated: కూకట్పల్లిలోని కేపీహెచ్ బీ (KPHB) కాలనీ ఫోరం మాల్ సర్కిల్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) మేనల్లుడు అగ్రజ్ (Agraj) ఫుల్లుగా మద్యం సేవించి నలుగురు స్నేహితులతో కలిసి కారు నడిపి హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో రాంగ్ రూట్ లో కారును నడిపి ఓ బైక్ ను ఢీకొట్టగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అగ్రజ్ ను అరెస్ట్ చేసి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేశారు. అందులో 90 శాతం ఆల్కహాల్ సేవించినట్లుగా తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అగ్రజ్ సహచరులపైనా కేసు నమోదైంది. బాధితులు సేల్స్ మ్యాన్ బన్వరీలాల్ (24), మరో వ్యక్తి ధురుచంద్ (33)గా గుర్తించారు.
ప్రమాదంలో యువకుడు మృతి
మరోవైపు, నగరంలోని బాలనగర్ లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఐడీపీఎల్ చౌరస్తా డీ మార్ట్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బైక్ డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న అఖిల్ (23) అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మందుబాబుల వీరంగం
అటు, శంషాబాద్ ఎయిర్ పోర్టులో మందుబాబులు సోమవారం వీరంగం సృష్టించారు. నగరానికి చెందిన నలుగురు వ్యక్తులు ఎయిర్ పోర్టులోని ఏరో ప్లాజా బార్ లో ఫుల్లుగా మద్యం సేవించి పార్కింగ్ ప్లేస్ వద్ద హల్ చల్ చేశారు. సిబ్బందిపై దాడి చేశారు. అనంతరం పారిపోయేందుకు యత్నిస్తుండగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది బారికేడ్లు అడ్డు పెట్టి అడ్డుకున్నారు. కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకోగా మరికొంతమంది పరారయ్యారు. పట్టుబడిన నిందితులను శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Prajapalana: 'ప్రజాపాలన' దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్ - మీకు ఆ ఫోన్ కాల్స్ వస్తున్నాయా.?