Chinchinada Bridge: ఆత్మహత్యలకు అడ్డాగా చించినాడ వంతెన: పిల్లలతో కలిసి నదిలోకి దూకిన తండ్రి.. పరిష్కారం ఏమిటి?
అంబేడ్కర్ కోనసీమ జిల్లాను పశ్చిమ గోదావరి జిల్లాను కలుపుతూ వశిష్ట నదీపాయపై దిండి - చించినాడ వద్ద నిర్మించిన చించినాడ వారధి వద్ద ఇటీవల కాలంలో బలవన్మరనాలు బాగా ఎక్కువయ్యిపోయాయి.

అంబేడ్కర్ కోనసీమ జిల్లాను పశ్చిమ గోదావరి జిల్లాను కలుపుతూ వశిష్ట నదీపాయపై దిండి - చించినాడ వద్ద నిర్మించిన చించినాడ వారధి ఆత్మహత్యలకు అడ్డాగా మారుతోంది.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మంది అనువుగా ఉన్న చించినాడ వంతెన వద్దకు వచ్చి అక్కడి నుంచి వశిష్ట నదిలోకి దూకేస్తున్నారు.. ఆ ప్రాంతం అంతా నిర్మాణుష్యంగా ఉండడం, చాలా నది లోతు ఎక్కువగా ఉండడంతో ఆవేశంతో నదిలోకి దూకిన వారు మృత్యువాత పడుతున్నారు... ఇటీవల కాలంలో ఈతరహా బలవన్మరనాలు బాగా ఎక్కువయ్యిపోయాయి..
క్షణికావేశ నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ...
ఆత్మహత్యలకు పాల్పడేవారు ఎక్కువ శాతం కేవలం క్షణికావేశంతో తీసుకునే ఈ నిర్ణయం తీసుకుంటుంటారు.. ఆ క్షణాల్లో గనుక వారి మానసిక స్థితిని అర్ధం చేసుకుని ఆపగలిగితే వారిలో భయం మొదలయ్యి ఆ నిర్ణయాన్ని మానుకుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు.. అయితే వారు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయ సమయంలో కాస్త ఆపగలిగేలా ఉంటే ఆ నిర్ణయం విరమించుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు.. అయితే దిండి - చించినాడ వంతెన నుంచి నదిలోకి దూకేయడం చాలా సులభంగా ఉండడంతో నిర్ణయం తీసుకున్నదే తడవుగా నేరుగా బ్రిడ్జిపైకి వచ్చి వశిష్ట నదిలోకి దూకేస్తున్నారు.. అదే గనుక అక్కడ పరిస్థితి అంత అనుకూలంగా లేకపోతే కాస్త సమయం దొరుకుతుంది.. ఈ లోపు అటువైపుగా ఎవ్వరైనా వెళుతూ వారిని చూసి ఆపగలిగే అవకాశం ఉండవచ్చు.. కానీ వంతెన సైడ్ వాల్స్ అంత ఎత్తులో లేకపోవడంతో చాలా మంది నదిలోకి ఆవేశంతో దూకేస్తున్నారు...
ఇద్దరు పిల్లల్ని నదిలోకి తోసి ఆపై తండ్రి ఆత్మహత్య..
ఇటీవలే ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లిన తండ్రి చించినాడ వంతెన పై బైక్, చెప్పులు, సెల్‌ఫోన్ ఉంచి అదృశ్యమైన సంఘటన చివరకు విషాదంతమయ్యింది.. ఇద్దరు పిల్లలతో తండ్రి వశిష్ట నదీపాయలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈఘటనలో వశిష్ట నదీపాయలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు తండ్రి, కుమారుడు, కుమార్తె మృతదేహాలు లభ్యం అయ్యాయి.
మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన శిరిగినీడి దుర్గాప్రసాద్ (40), కుమారుడు మోహిత్ (14), కుమార్తె జాహ్నవి(9) ఆరోజు రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో చించినాడ వంతెన పై ఓ బైక్, ముగ్గురు చెప్పులు, సెల్‌ఫోన్ ఉంచి అదృశ్యమయ్యారు. ఆత్మహత్యగా నిర్ధారించిన పోలీసులు వశిష్ట నదిలో గాలించగా ముగ్గురు మృతదేహాలు లభ్యం అయ్యాయి. భార్య భర్తల మధ్య తలెత్తిన స్వల్ప మనస్పర్థల కారణంగా పిల్లల్ని ఆధార్ కార్డు అప్‌డేట్ చేయిస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన భర్త దుర్గా ప్రసాద్ పిల్లలు ఇద్దరిని ముందు నదిలోకి తోసేసి ఆపై తాను దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
గతంలోనూ పలువురు ఆత్మహత్య..
దిండి - చించినాడ వంతెన పైనుంచి వశిష్ట నదిలోకి దూకి ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ సొసైటీ మాజీ అధ్యక్షుడు, ఓ హోటల్ యజమాని వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా నదిలోకి దూకిన వారి మృతదేహాలు కూడా కొన్ని సందర్భాల్లో లభ్యం కాని పరిస్థితి ఉంది.. వరద నీటి ఉద్ధృతికి ఆత్మహత్యకు పాల్పడిన వారి మృతదేహాలు కొంత మందివి లభ్యం కాలేదు.
రక్షణ గోడ ఎత్తు చేయాలని డిమాండ్..
దిండి - చించినాడ వంతెన ఆత్మహత్యలకు అడ్డాగా మారుతుండడంతో వంతెనకు ఇరువైపులా రక్షణ గోడ ఎత్తు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. క్షణికావేశంలో బ్రిడ్జిపైకి వస్తున్నారు నదిలోకి దూకాలని ప్రయత్నిస్తున్నా వంతెన రక్షణ గోడలు ఎత్తులో నిర్మించడం లేదా వంతెనకు ఇరువైపులా ఐరన్ కంచెను వేయడం ద్వారా కానీ ఆత్మహత్యల ను చాలా వరకు నియంత్రించవచ్చని, దీనికి ప్రజాప్రతినిధులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





















