Nara Lokesh Jacket in CII Summit: లోకేష్ మెచ్చిన కోట్ తయారుచేసింది "పులగుర్త " చేనేత కార్మికులే... దీని స్పెషాలిటిి ఏంటీ?
లోకేష్ మెచ్చిన కోట్ తయారుచేసింది "పులగుర్త " చేనేత కార్మికులే అయితే తక్కువ ధరలో ఎక్కువ క్వాలిటీ ఎలా ఇస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చేనేత పేరు చెప్పగానే ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి లాంటి పేర్లు వినిపిస్తాయి. కానీ పెద్దగా పాపులర్ కానీ మరొక చేనేత రకం తూర్పుగోదావరి జిల్లాలో ఉందనే విషయం చాలామందికి తెలియదు. అదే "పులగుర్త " చేనేత. అనపర్తి మండలంలోని ఈ చిన్న గ్రామం ఇప్పుడు వార్తల్లోకి ఎక్కడానికి కారణం ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి వారు అందజేసిన తమ ఊరి చేనేత "కోటు".
అది ఆయనకు ఎంతో నచ్చి ఇటీవల జరిగిన CII సమిట్ లో ధరించడమే కాకుండా ఆ ఊరి చేనేత గురించి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా పులగుర్త చేనేత ఫై మరోసారి అందరి దృష్టి పడింది. ఇంతకు ఈ చేనేత రకం స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం..!
How’s my new jacket?
— Lokesh Nara (@naralokesh) November 15, 2025
Can you guess what it’s made of? Drop your guess below - the right answer wins a surprise gift! Answer will be posted 7 pm. #GuessAndWin#CIIPartnershipSummit2025 pic.twitter.com/yaas22bYIl
బ్రిటీష్ కాలం నుండే తయారీ లో ఉన్న "పులగుర్త " చేనేత
గోదావరి ప్రాంతం లో బ్రిటీష్ కాలం లోనే పులగుర్త లో చేనేత తయారీ ఉంది. కానీ కేవలం చుట్టుపక్కల గ్రామాల్లోనే వాటిని అమ్మవారు.వాటిని ఇతర ప్రాంతాల్లో అమ్మాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడం తో తొలిసారిగా 1947 ఏప్రిల్ లో అంటే దేశానికి స్వాతంత్య్రం రావడానికి కొన్ని నెలల ముందు పులగుర్త చేనేత సొసైటీ ఏర్పడిందని ప్రస్తుత సెక్రటరీ భీమరాజు అన్నారు. ప్రస్తుతం తమ సొసైటీ పరిధిలో ఉన్న నాలుగు ఊళ్ల లో మొత్తం 400 వరకూ మగ్గాలు ఉన్నాయని ఆయన అన్నారు. గత 35 ఏళ్లుగా తమ సొసైటీ లాభాల్లో ఉందని ఆయన అన్నారు.

క్వాలిటీ ఎక్కువ.. ధర తక్కువ.. అదే పులగుర్త చేనేత స్పెషల్
పులగుర్త చేనేత కార్మికులు దారాల దగ్గర నుండి పూర్తి వస్త్రం తయారీ వరకూ స్వయంగా తామే తయారు చేసుకుంటారని అన్నారు పులగుర్త చేనేత సొసైటీ మాజీ ప్రెసిడెంట్ పెరిశెట్టి లాలయ్య. పొందూరు ఖద్దరు తో సమానమైన క్వాలిటీ మైంటైన్ చేస్తూనే రేటు మాత్రం చాలా తక్కువగా ఉంటుందని అలాగే గోదావరి జిల్లాలకు ప్రత్యేకమైన ఒక మెరుపును ఖద్దరు పై తేవడం తమ ఊరి చేనేత కార్మికుల స్పెషాలిటీ అని ఆయన అన్నారు.

డి. భీమరాజు ( పులగర్త చేనేత సొసైటీ సెక్రటరీ), పేరిశెట్టి. లాలయ్య (పులగుర్త చేనేత సొసైటీ మాజీ ప్రెసిడెంట్)
CII సమిట్ లాంటి పెద్ద ఈవెంట్లో మంత్రి నారా లోకేష్ స్వయంగా పులగుర్త చేనేత కోటు ధరించడం ఎంతో తమ ఊరి హ్యాండ్లూమ్ కళాకారులకు ఎంతో అనందాన్ని ఇచ్చిందని లాలయ్య చెప్పారు. తమ ఊర్లో తయారయ్యే బట్టలను చేనేత సొసైటీ కి ఇచ్చేస్తామని వాటిని పులగుర్త చేనేత సొసైటీ అమ్ముతుందని చెప్పారు. 
అయితే మారిన కాలాన్ని అనుసరించి పులగుర్త చేనేత వస్త్రాలను అమ్మడం తో పాటు హైదరాబాద్ బొంబాయి లాంటి ప్రాంతాల్లో జరిగే ఎగ్జిబిషన్లలోనూ ప్రదర్శిస్తున్నట్టు లాలయ్య అన్నారు. టాప్ క్వాలిటీ వస్త్రాలు సైతం తమ దగ్గర 700 నుండి 4000 వరకే ఉంటాయని అదే ఇతర ప్రాంతాల్లో తయారయ్యే చేనేత వస్త్రాల రేటు చాలా ఎక్కువ గా ఉంటుందని ఆయన అన్నారు.

లోకేష్ ద్వారా పాపులారిటీ.. సమస్యలు తీరుతాయని ఆశిస్తున్నాం: పులగుర్త చేనేత కార్మికులు
గత 40ఏళ్ల నుండీ తాము చేనేత కళాకారులు గానే బతుకుతున్నాం అని అన్నారు పులగుర్త కు చెందిన సత్యనారాయణ, అనంతలక్ష్మీ దంపతులు. ఇప్పుడు లోకేష్ ద్వారా పులగుర్త చేనేత కు క్రొత్త పాపులారిటీ వచ్చిందని అందుకు సంతోషంగా ఉందని వారు అన్నారు. అయితే ఇంకా కొన్ని కీలక సమస్యలు ఉన్నాయని చేనేత కార్మికులకు ఇస్తామన్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇంకా ఇంప్లీమెంట్ కాలేదని, పావలా వడ్డీ రుణాలను కూడా అందించే ఏర్పాటు చేస్తే పులగుర్త చేనేత కు ఊపిరి ఊదినట్లు అవుతుందన్నారు.

తమ సొసైటీ కి 2014-19 మద్య కాలంలో ప్రభుత్వం నుంది రావాల్సిన బకాయిలు విడుదల చెయ్యాలని కోరుతున్నారు. ఏదేమైనా న్యూ జనరేషన్ కాలంలో మరుగున పడుతున్న పులగుర్త చేనేత వంటి కళను మరోసారి జనం నానేలా చేసిన మంత్రి నారా లోకేష్ ను అభినందిస్తూనే తమ సమస్యలఫై కూడా కొద్దిగా దృష్టి పెట్టమని కోరుతున్నారు అక్కడి కళాకారులు.





















