Biryani Theft: బిర్యానీ కోసం దొంగగా మారిన బాలుడు... చిరుతిళ్ల కోసం తాళం వేసిన ఇళ్లే లక్ష్యం... ఒకే పీఎస్ లో 10 కేసులు
బిర్యానీ కోసం దొంగగా మారిన బాలుడు. ఇదేదొ సినిమా దొంగతనం కాదు. బిర్యానీ అంటే పడిచచ్చిపోయే ఈ బాలుడిపై ఒకే పీఎస్ లో పది కేసులు నమోదయ్యాయంటే... వీడు మామూలోడు కాదని తెలుస్తుంది కదా.
హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచ వ్యాప్తంగా పేరు. ఇక్కడికి ఎవరు వచ్చిన బిర్యానీ టేస్ట్ చేయకుండా వెళ్లరు అంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ బిర్యానీ అంటే పడి చచ్చిపోయే ఓ బాలుడు.. బిర్యానీ కోసం ఏకంగా దొంగగా మారిపోయాడు. బిర్యానీతో చిరుతిళ్లకు అలవాడు పడి చోరీలు మొదలుపెట్టాడు. రోజూ బిర్యానీ కొనేందుకు డబ్బులు లేవు. కూలి పనుల ద్వారా వస్తున్న డబ్బు తన తిండికి సరిపోక దొంగతనాలకు అలవాటు పడ్డాడు.
తిండి కోసం దొంగతనాలు
తాళం వేసి ఉన్న ఇళ్లని లక్ష్యంగా చేసుకుని, గుట్టుచప్పుడు కాకుండా చోరీలు చేస్తున్నాడు. చోరీ సొత్తుతో హోటల్‌కెళ్లి బిర్యానీ కుమ్మేస్తున్నాడు. మిగిలిన డబ్బుతో చిరుతిళ్లు తినేవాడు. ఇలా బిర్యానీ కోసం దొంగలా మారిపోయాడు. చిరుతిళ్లు తింటూ దొంగతనాలు ఎలా చేయాలో ఆలోచించేవాడు. కేవలం రుచికరమైన తిండి కోసం దొంగతనం చేస్తున్న ఈ దొంగ వయసు పదమూడేళ్లే.
ఒకే పీఎస్ లో 10 కేసులు
ఆ బాలుడి వయస్సు 13 ఏళ్లే కానీ అతనిపై ఒక్క పీఎస్ పరిధిలోనే 10 చోరీ కేసులు నమోదయ్యాయి. తాజాగా రెండు రోజుల క్రితం ఆ బాలుడు మునగనూరు అంజనాద్రినగర్‌లో చోరీకి పాల్పడుతుండగా బాలుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారించగా ఆర్నెల్ల వ్యవధిలోనే హయత్‌నగర్ ఠాణా పరిధిలో చోరీలకు పాల్పడినట్లు తేలింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. చోరీలకు పాల్పడుతుంది చేయి తిరిగిన దొంగ అనుకున్న పోలీసులు బాలుడ్ని చూసి ఆశ్చర్యపోయారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు కూడా అంతే ఆశ్చర్యాన్ని కలిగించాయి.
Also Read: Andhra Pradesh:మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు..శేషవస్త్రం సమర్పించిన టీటీడీ
బిహార్ చెందిన బాలుడు
హయత్ నగర్ పరిధిలో ఈ బాలుడిపై పది కేసులు నమోదైనట్లు తేలింది. హయత్‌నగర్ సీఐ సురేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌కు చెందిన బాలుడు కూలి పనులు చేసుకుంటూ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూరు అంజనాద్రి నగర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం ఓ ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. బంగారం, వెండి, ఫోన్ చోరీకి గురయ్యాయని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.60 వేల విలువైన బంగారం, 70 గ్రాముల వెండి, రూ.4 వేలు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
గతంలో ఒకసారి బాల నేరస్థుల హోమ్ కి
బిర్యానీ, చిరుతిళ్లకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలు చేస్తున్నట్లు విచారణలో బాలుడు తెలిపాడు. గతంలో ఒకసారి బాలుడ్ని అదుపులోకి తీసుకుని బాలనేరస్థుల గృహానికి పంపామని పోలీసులు తెలిపారు. విడుదలైన తర్వాత కూడా చోరీలు కొనసాగిస్తున్నాడు. స్థానికంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.