Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, నంబాల కేశవరావు సహా 28 మంది మావోయిస్టులు మృతి!
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 28 మంది వరకు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు పార్టీకి ఇది నిజంగానే పెద్దదెబ్బ. ఇదివరకే పలువురు అగ్రనేతలను మావోయిస్టులు కోల్పోయారు.

Encounter in Chhattisgarhs Abujhmad | బీజాపూర్: ఛత్తీస్‌గఢ్ మరోసారి కాల్పులమోతతో దద్దరిల్లింది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలలో నక్సలైట్లకు.. డిఆర్జి జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా DRG జవాన్లు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. తాజాగా బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్‌జీ బలగాలు కలిసి కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో నారాయణపూర్ జిల్లా మాధ్‌లో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపారు. వెంటనే స్పందించిన డీఆర్జీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మృతులలో మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు(66) ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై రెండు దశబ్దాల కిందట అలిపిరిలో జరిగిన బాంబుదాడిలో ప్రధాన సూత్రధారిగా నంబాల ఉన్నారు. ఆయన మీద రూ. 1.5 కోట్ల భారీ రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా పలుమార్లు చాకచక్యంగా తప్పించుకున్న నంబాల తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఐఈడీల వినియోగంలోనూ ఆయన ఎక్స్‌పర్ట్. కాగా, ఇటీవల జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో అలిపిరి దాడుల సూత్రధారి, మావోయిస్టు చలపతి చనిపోవడం తెలిసిందే.
ఈ ఎన్‌కౌంటర్‌లో కోబ్రా కమాండోలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు మావోయిస్టుల కంపెనీ-7 (coy7) యూనిట్‌ను టార్గెట్ చేశాయి. ఈ ఆపరేషన్‌లో దాదాపు 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలంగాణ నిఘా వర్గాల సమాచారం. మృతుల్లో బసవరాజ్, మధు (దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అగ్ర మావోయిస్టు నేత), మావోయిస్టు ప్రచురణ జంగ్‌తో సంబంధం ఉన్న నవీన్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్ అడవులను జల్లెడ పడుతున్న బలగాలు
అబుడ్ మడ్ నక్సల్ ఫ్రంట్‌లో ప్రధాన ఆపరేషన్ కొనసాగుతోంది. DRG సైనికులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టగా వారి నుంచి తప్పించుకుంనేందేకు ఒక్కసారిగా మావోయిస్టులు వారిపై జరిపారు. వెంటనే స్పందించిన జవాన్లు సైతం పెద్ద ఎత్తున కాల్పులు జరిపి వారి ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. గత కొన్ని రోజులుగా కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి, ప్రతి ప్రాంతాన్ని జలెల్లడ పట్టాయి బలగాలు. దాదాపు వారం రోజులు శ్రమించిన అనంతరం బలగాలు కర్రెగుట్ట ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అక్కడ జాతీయ పతకాన్ని ఎగురవేసి, ఆ ప్రాంతానికి స్వేచ్ఛ లభించిందని ప్రకటించారు.
మార్చి 2026 నాటికి దేశంలో నక్సలైట్లు, మావోయిస్టులు లేకుండా చేయాలన్నది తమ లక్ష్యమని కేంద్రం చెబుతోంది. మావోయిస్టుల ఏరివేత విషయంలో బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు పేర్కొన్నారు. మావోయిస్టులు చర్చల కోసం లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది.






















