Suryapet: పశువుల అక్రమ రవాణా, కంటైనర్ లో ఊపిరాడక 16 ఎద్దులు మృత్యువాత
Suryapet Crime News: నిత్యం ఎక్కడో చోట పశువుల అక్రమ రవాణా రోజు రోజుకు పెరుగుతోంది. పవిత్రంగా భావించే పశువులు అక్రమ రవాణాకు గురికావడం, ఊపిరాడక చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Suryapet: తెలంగాణలో అక్రమ పశువుల రవాణా రోజు రోజుకు పెరుగుతోంది. పవిత్రంగా భావించే పశువులు అక్రమ రవాణాకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. వాటి అక్రమ రవాణా అరికట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా ఇంకా అక్కడక్కడ ఈ అక్రమ రవాణా దందా కొనసాగుతోంది . రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పశువుల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఇలా కొందరు దుర్మార్గులు ఎటువండి భయం లేకుండా యధేచ్ఛంగా రవాణా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. వారి డబ్బు ఆశకు పశువులు దారిలో మరణిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ చోటు చేసుకుంటున్నాయి.
సూర్యాపేట జిల్లా మట్టపల్లి మండలంలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న 16 ఎద్దులు ఊపిరాడక మృత్యువాత పడ్డాయి. తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులు కంటైనర్‌లో మూగజీవాలను తరలిస్తుండగా.. మట్టపల్లి చెక్ పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ఎద్దులు చనిపోయిన ఈ విషాదఘటన వెలుగులోకి వచ్చింది. కంటైనర్లో మొత్తం 26 ఎద్దులను తరలిస్తున్నారు. వాటిలో ఊపిరాడక 16 ఎద్దులు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మరో తొమ్మిది ఎద్దులను నల్లగొండలోని గోశాలకు తరలించారు. కాగా రెండు ఎద్దులకు కాలు విరిగి గాయపడగా పశు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు మట్టపల్లి చెక్ పోస్టు వద్ద పోలీసులు కంటైనర్ ను పట్టుకున్నారు. ఈ క్రమంలో వారిలో పోలీసులు సెటిల్మెంట్ కు దిగారు. అది కుదరక ఉన్నతాధికారికి తెలియడంతో రాత్రి 8 గంటలకు ఎస్ఐ రామాంజనేయులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే మఠంపల్లి పోలీసులపై విచారణ కు ఆదేశించారు. ఎస్ఐ రామాంజనేయులు నిర్లక్ష్యం వల్లనే 16 ఆవులు చనిపోయాయని సర్వత్ర విమర్శలు వెల్వెత్తుతున్నాయి. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన ఎద్దులకు పశువైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
పశురవాణా చట్టం..
పశురవాణా చట్టం 1978 ప్రకారం పశువులను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే మొదట మండల స్థాయి తీర్మానాన్ని చేయాలి. ఒక వ్యానులో రెండు, లారీలో అయితే నాలుగు మించి పశువులను తరలించకూడదు. పశువులను తరలించే వాహనంలో గాలి, వెలుతురు సదుపాయం ఉండాలి. అలాగే పశువులకు నీరు, తగినంత ఆహారం కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి అరగంటకోసారి పశువులను వాహనం దింపి అవి కాస్త సేద తీరే విధంగా చర్యలు తీసుకోవాలి.