Vedanta New Company: తీర్చలేనన్ని అప్పులు నెత్తి మీదున్నా కొత్త కంపెనీ స్టార్ట్ చేసిన అనిల్ అగర్వాల్
కొత్త కంపెనీ సెసా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, గోవాలో వేదాంత తరపున ఇనుము & ఉక్కు బిజినెస్ చేస్తుంది.
Vedanta New Company: మెటల్ & మైనింగ్ రంగంలో బడా ఇండస్ట్రియలిస్ట్, వేదాంత గ్రూప్ ఫౌండర్ & ఛైర్మన్ అనిల్ అగర్వాల్ (Anil Agarwal) మరో కొత్త కంపెనీని స్థాపించారు. కొత్త కంపెనీ పేరు సెసా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ (Sesa Iron and Steel Limited). దీనిని గోవాలో రిజిస్టర్ చేశారు. ఈ కంపెనీ, వేదాంత లిమిటెడ్‌కు (Vedanta Ltd) అనుబంధ సంస్థగా పని చేస్తుంది.
వేదాంత కొత్త కంపెనీ చేసే బిజినెస్
కొత్త కంపెనీ సెసా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, గోవాలో వేదాంత తరపున ఇనుము & ఉక్కు బిజినెస్ చేస్తుంది. అయితే, ఈ కంపెనీ కార్యకలాపాలు ఇంకా విస్తరించాల్సి ఉంది. వేదాంతకు చెందిన ఒక అనుబంధ సంస్థ ఇప్పటికే గోవాలో పని చేస్తోంది, దాని పేరు సెసా గోవా ఐరన్ ఓర్ (Sesa Goa Iron Ore). ఇనుప ఖనిజం అన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్ పనులను ఈ కంపెనీ చూసుకుంటుంది. ఇనుము, ఉక్కుకు అత్యంత కీలక ముడి పదార్థం ఇనుప ఖనిజం.
ముంబయి కేంద్రంగా పని చేస్తున్న వేదాంత లిమిటెడ్ పేరెంట్ కంపెనీ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ (Vedanta Resources Limited). దీని హెడ్ కార్టర్స్ లండన్‌లో ఉంది. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్, భారత్ సహా చాలా దేశాలలో మెటల్ & మైనింగ్ బిజినెస్ చేస్తోంది. భారతదేశంలో మొత్తం వ్యాపారం వేదాంత లిమిటెడ్ ద్వారా నడుస్తుంది.
జాంబియాలోని కొంకోలా రాగి గనుల ఓనర్‌షిప్ & కంట్రోల్‌ను జాంబియా ప్రభుత్వం తమకు తిరిగి అప్పగించిందని వేదాంత రిసోర్సెస్ ఈ వారం ప్రకటించింది. గతంలో, వేదాంత రిసోర్సెస్ - జాంబియా ప్రభుత్వం మధ్య వివాదం నడుచింది. వివాదాన్ని పరిష్కరించడానికి, జాంబియాలో మైనింగ్ సెక్టార్‌లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి వేదాంత రిసోర్సెస్ హామీ ఇచ్చింది.
ఆర్థిక సంక్షోభంలో వేదాంత గ్రూప్
ప్రస్తుతం, వేదాంత రిసోర్సెస్ భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గతంలో తెచ్చిన అప్పులు తిరిగి చెల్లించడానికి డబ్బుల్లేక కొత్త అప్పులు చేస్తోంది. వేదాంత రిసోర్సెస్‌కు డబ్బులు అవసరమైనప్పుడల్లా, సబ్సిడియరీ కంపెనీ అయిన వేదాంత లిమిటెడ్ డివిడెండ్‌ను ప్రకటించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. తాజాగా, కొత్త రుణం కోసం వేదాంత రిసోర్సెస్ ప్రయత్నిస్తోంది. 1.3 బిలియన్ డాలర్ల రుణం కోసం స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ఈ రుణం కాల పరిమితి 3 సంవత్సరాలు ఉంటుంది, వడ్డీ రేటు దాదాపు 14-15 శాతం మధ్య ఉండొచ్చు.
ఇవాళ (08 సెప్టెంబర్ 2023) ఉదయం 11.40 గంటల సమయానికి వేదాంత షేర్లు 25 పైసలు లేదా 0.10% రెడ్ కలర్ రూ.238.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ స్టాక్ గత ఆరు నెలల్లో 16% పైగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 25% నష్టపోయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఆధార్ వివరాలను 'ఫ్రీ'గా అప్‌డేట్ చేసేందుకు మరింత సమయం, లాస్ట్ డేట్ 3 నెలలు పెంపు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial