Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Andhra Politics: కేబినెట్ మార్పు చేర్పుల్లో నాగబాబుకు పవన్ శాఖలు కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. నాగబాబుకు కేటాయించే శాఖలు జనసేన మంత్రుల నుంచే ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు.
Andhra Pradesh Janasena: ఏపీ కేబినెట్‌లో మార్పు చేర్పులకు సమయం అయింది. అయితే ఖాళీగా ఉన్న ఒక్క స్థానాన్ని మాత్రం భర్తీ చేస్తారు. కానీ శాఖల మార్పు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ సంగతి పక్కన పెడితే జనసేన పార్టీ నుంచి మంత్రి కాబోతున్న నాగబాబుకు పవన్ నిర్వహిస్తున్న కీలక శాఖలను కూడా ఇస్తారని చెబుతున్నారు.
కీలక శాఖలు చూస్తున్న పవన్ కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి చేతిలో చాలా శాఖలు ఉన్నాయి. ఆయన ఎంతో మనసుపెట్టి తీసుకున్న విభాగాలవి. అయితే వాటిలో ముఖ్యమైన ఒక శాఖ కు ఆయన దూరం కానున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏపీ ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో పర్యావరణం, పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన మనసుపెట్టి తీసుకున్న శాఖలే. ప్రస్తుతం వీటిలో అటవీ శాఖను పవన్ కళ్యాణ్ వదులుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆయన సోదరుడు కొణిదెల నాగబాబు మంత్రివర్గంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఆయనకు అటవీ శాఖను అప్పజెప్పనున్నట్టుగా సమాచారం.
Also Read: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
పని భారం తగ్గించుకునే ఉద్దేశంలో పవన్
మరోవైపు పవన్ కళ్యాణ్ తన పెండింగ్ సినిమాలను పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ మంగళగిరిలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతోంది. త్వరలో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న OG షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా జరగాల్సి ఉంది. వీటి కోసం మార్చి నెల నుండి పవన్ బిజీ కానున్నారు. కాబట్టి ఆయన పై ఒత్తిడి తగ్గించేందుకు అటవీ శాఖను నాగబాబుకి అప్పచెప్పే ఆలోచనలో ఉన్నారు జనసేన పెద్దలు. మరో జనసేన నేత కందుల దుర్గేష్ వద్ద మూడు శాఖలు ఉన్నాయి. పర్యాటకం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలను దుర్గేష్ నిర్వహిస్తున్నారు. ఇంటిలో సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకి అప్పజెప్ప ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల నాగబాబుకి అటవీ సినిమాటోగ్రఫీ లాంటి కీలక శాఖలను చెప్పడంతో పాటు ఆ శాఖలు ప్రస్తుతం జనసేన చేతిలోనే ఉన్నాయి కాబట్టి మరో జనసేన నేత నాగబాబు కి అవి కట్టబెట్టినా సమస్య ఏదీ ఉండదనేది సీయం చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. మధ్యలో అకస్మాత్తుగా మార్పు లేవీ జరగకపోతే నాగబాబు ఈ శాఖలు కేటాయించడం దాదాపు ఖరారు అయినట్టేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
Also Read: టీడీపీ క్యాడర్ ఆన్ ఫైర్ - మంత్రి పార్థసారధి అర్థం చేసుకోలేకపోయారా ?
సోదరుడికి తగిన గౌరవం ఇవ్వాలని పవన్ పట్టుదల
2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైనా గత ఐదేళ్లు తమ్ముడి వెంటే జన సైనికులకండగా ఉన్నారు నాగబాబు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగానో, ఎమ్మెల్యే గానో పోటీ చేయాలనుకున్నా కూటమి సీట్ల సర్దుబాటు పరం గా కుదరలేదు. భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నా రాజకీయ సమీకరణాల పరంగా దాన్నీ వదులుకోవాల్సి వచ్చింది. తాజాగా రాజ్యసభ సీటు ఖరారు అనుకున్నప్పటికీ దాన్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో చంద్రబాబు తన మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక లాంఛనం కూడా పూర్తి కాబోతోంది. ఆ సందర్భంగా గానే ఈ శాఖల కేటాయింపు అంశం తెరపైకి వచ్చింది.