Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
BJP MPs: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు నమోదు పెట్టింది. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీలపై ఆయన దాడి చేశారని కమలం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP May File Case Against Rahul Gandhi: పార్లమెంటులో గురువారం తోపులాట వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ తోయడం వల్లే తమ ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారని కమలం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహచర ఎంపీలపై దాడి చేసేందుకు రాహుల్‌కు ఏ చట్టం అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు. 'ఇతర ఎంపీలను కొట్టడానికే కరాటే, కుంగ్ ఫూ నేర్చుకున్నారా.?' అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై.. దాడి, ప్రేరేపణపై ఫిర్యాదు చేసినట్లు బీజేపీ ఎంపీలు తెలిపారు. ఆయనపై సెక్షన్ 109, 115, 117, 125, 131, 351 కింద ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సెక్షన్ 109 హత్యాయత్నం అని పేర్కొన్నారు. కాగా, అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఇండియా కూటమి పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య హింసాత్మక సంఘటనలు జరిగాయి. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారు. వీరిని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రధాని మోదీ వీరిని ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఇదీ జరిగింది
కాగా, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలను నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. అటు, అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికారపక్ష ఎంపీలు సైతం నిరసన తెలిపారు. ఇరువర్గాల ఆందోళనతో పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగా బీజేపీ ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తోయడం వల్లే వీరు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. పార్లమెంటులోని ద్వారం వద్ద ఉన్న గోడ ఎక్కి ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఫ్లకార్డులు చూపిస్తూ ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడకు ఎన్డీయే కూటమి ఎంపీలు వచ్చారు. వీరిని లోపలికి వెళ్లకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే జరిగిన గందరగోళంలో బీజేపీ ఎంపీలు ముకేశ్ రాజ్‌పుత్, ప్రతాప్ చంద్రసారంగి కిందపడి గాయపడ్డారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. 'ఇద్దరు ఎంపీల తలలకు దెబ్బలు తగిలాయి. సారంగి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో కుట్లు వేశాం. ముకేశ్ రాజ్‌పుత్ స్పృహ కోల్పోయిన స్థితిలో వచ్చారు. వైద్యం అందించాక ఆయన కోలుకుని స్పృహలోకి వచ్చారు.' అని వైద్యులు వెల్లడించారు. ఎంపీలకు ప్రధాని మోదీ ఫోన్ చేసి పరామర్శించారు.
'రాహుల్ ఎంపీని నెట్టేశారు'
తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా.. రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి మీడియాకు తెలిపారు. ఆయన వచ్చి తనపై పడడంతో కింద పడినట్లు చెప్పారు. అయితే, తాను పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా.. బీజేపీ ఎంపీలు తనను అడ్డుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగంపై బీజేపీ నేతలు దాడి చేస్తున్నారని.. అంబేడ్కర్‌ను అవమానించారని మండిపడ్డారు.
Also Read: Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా