నా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షా
రాజ్యసభలో కేంద్రహోం మంత్రి అమిత్ షా అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంబేడ్కర్ పేరుకి బదులుగా దేవుడిని స్మరించుకుంటే పుణ్యమైనా వస్తుందని ఆయన చేసిన కామెంట్స్‌పై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. తమిళ నటుడు విజయ్‌తో పాటు కమల్ హాసన్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అయితే...ఈ వివాదంపై స్వయంగా అమిత్ షా స్పందించారు. ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అంబేడ్కర్ గురించి తప్పుగా మాట్లాడలేదని, ఆ తరవాత కాంగ్రెస్ ఆయనకు చేసిన అన్యాయం గురించీ ప్రస్తావించానని అన్నారు. కాంగ్రెస్ కేవలం ముందు మాట్లాడిన ఆ క్లిప్‌ని మాత్రమే సోషల్ మీడియాలో ప్రచారం చేసి తమపై బురద జల్లుతోందని మండి పడ్డారు. బీజేపీ ఎప్పుడూ అంబేడ్కర్‌ని అవమానించదని తేల్చి చెప్పారు. ఎడిట్ చేసిన క్లిప్ కాకుండా...పూర్తి వీడియోని టెలికాస్ట్ చేయాలని మీడియాని రిక్వెస్ట్ చేశారు అమిత్ షా. "రాజ్యసభలో అంబేడ్కర్ మీద నా కామెంట్స్ ట్విస్ట్ చేసి ప్రచారం చేశారు. ఆ కామెంట్స్ నే ప్రచారం చేస్తూ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మోదీ మీద ఫేక్ వీడియోలు వదిలారు. అప్పట్లో AI ఉపయోగించి నా వ్యాఖ్యలను మార్చి ప్రచారం చేశారు. మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నా నా పూర్తి ప్రసంగం టెలికాస్ట్ చేయండి" అని వెల్లడించారు.