Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Telangana News: తెలంగాణ అసెంబ్లీలో గురువారం తీవ్ర గందరగోళం నెలకొంది. సరైన సమాచారం లేదంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయగా.. దానికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.
Heated Discussion In Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) వాడీవేడీగా సాగుతున్నాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య గురువారం మాటల యుద్ధం కొనసాగింది. సభా కార్యకలాపాలపై సరిగ్గా సమాచారం ఇవ్వడం లేదని.. ఎలాంటి సమాచారం లేకుండానే ఆర్థిక పరిస్థితిపై చర్చ పెట్టారని విపక్షాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. సభ నడిపే తీరు ఇది కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (HarishRao) తెలపగా.. శాసనసభ నిబంధనల ప్రకారం సభ నిర్వహించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్.. స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సభ్యులకు కనీసం సమాచారం లేకుండా ఎలా మాట్లాడుతారని.. బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జరిగి సభలో గందరగోళం నెలకొంది.
'స్పీకర్ సారీ చెబుతారా.?'
కాగా, విపక్షాల విమర్శలపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. 'సభ నిర్వహణలో కొంత సమాచారం లోపం జరిగింది. దీనికే స్పీకర్ సారీ చెబుతారా.?. స్పీకర్ కార్యాలయం తీసుకునే నిర్ణయాలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండాల్సిందే. చిన్నపాటి సమాచార లోపానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. హరీశ్‌రావు, అక్బరుద్దీన్.. ఇద్దరూ సీనియర్ సభ్యులు. వారు ఏదైనా చెప్పాలనుకుంటే రిక్వెస్ట్ చేయాలి. అంతేకానీ హుకుం జారీ చెయ్యొద్దు. తప్పు చేస్తే తప్పకుండా క్షమాపణ చెబుతాం. ఎంతో ముఖ్యమైన అంశంపై సభలో చర్చ కొనసాగుతుండగా.. చర్చను పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారు. సభ సజావుగా జరగాలని బీఆర్ఎస్ నేతలు భావించడం లేదు. ప్రభుత్వపరంగా ఏదైనా పొరపాటు జరిగితే శాసనసభ వ్యవహారాల మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటాను. జవాబుదారీగా ఉంటా.. అంతేకానీ స్పీకర్ క్షమాపణ చెప్పాలంటే ఎలా సాధ్య అవుతుంది.?' శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా.?'
అటు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. హరీష్ రావు మధ్య కూడా అసెంబ్లీలో వాడీవేడీ వాదన సాగింది. నల్గొండ జిల్లాలో నీటి సమస్యపై మంత్రి ప్రస్తావించారు. ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ మురుగునీటితో ప్రజలు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసిన 70 శాతం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినా దీన్ని పూర్తి చేయలేదన్నారు. తమ ప్రభుత్వం గంధమల్ల రిజర్వాయర్ పనులు పూర్తి చేసిందని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 40 లక్షల మంది జీవితాలను కాపాడాలని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
దీనిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.. 'సభలో ఓ మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదు. ఇలా ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఇస్తే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుంది. లేని సంస్కృతిని తీసుకురావొద్దు.' అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. 'హరీష్ రావు బీఆర్ఎస్‌కు డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా?. ఏ హోదాతో మాట్లాడుతున్నారు.?. ఆయనకు ప్రశ్నించే హక్కు లేదు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు హాజరు కాకపోవడం, తెలంగాణ ప్రజలను అవమానపరచడమే.' అంటూ మండిపడ్డారు.
Also Read: KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్ కాదా? రాహుల్‌కు కేటీఆర్ లేఖ