KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్ కాదా? రాహుల్‌కు కేటీఆర్ లేఖ
Telangana News: అదానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుంటే రేవంత్ ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ద్వంధ్వ వైఖరిపై సమాధానం చెప్పాలని రాహుల్‌ను డిమాండ్ చేశారు.
Telangana News: కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని దీనిపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖ రాశారు. లేఖలో ఏం చెప్పారంటే..." కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న వైరుధ్య, ద్వంద్వ ప్రమాణాలకు సమాధానాలు కోరాలని తెలంగాణ ప్రజల తరపున నేను లేఖ రాస్తున్నారు. గౌతమ్ అదానీకి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మీరు, మీ పార్టీ నేతలు దేశ వ్యాప్తంగా పోరాడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణలో మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి.
గౌతమ్ అదానీ, కేంద్రప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఏఐసీసీ పిలుపు మేరకు డిసెంబర్ 18న తెలంగాణ పీసీసీ 'చలో రాజ్ భవన్' కార్యక్రమం చేపట్టింది. అదానీకి వ్యతిరేకంగా యుద్ధం అని పార్టీ పిలుపు ఇస్తుంటే తెలంగాణలో మీ ముఖ్యమంత్రి అదానీ గ్రూప్‌కు రెడ్ కార్పెట్ పరిచారు.
గౌతమ్ అదానీని రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికడమే కాకుండా అదానీ గ్రూప్‌కు పెట్టుబడులు, ప్రాజెక్టులకు ప్రక్రియను సులభతరం చేశారు. గత జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నంలో, విద్యుత్ బిల్లుల వసూలు ప్రాజెక్టును అదానీకి అప్పగించాలని యోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇది మీ పార్టీ నిబద్ధతను ప్రశ్నిస్తోంది.
మీ పార్టీ క్రోనీ క్యాపిటలిజానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే వంత్ రెడ్డి భారీ విరాళాన్ని ఎందుకు స్వీకరించారు. గౌతమ్ అదానీ నుంచి 100 కోట్లు తీసుకోవడం క్విడ్ ప్రోకో కాదా? ఈ అపవిత్ర ఒప్పందాన్ని BRS బహిర్గతం చేసిన తర్వాతే ఆ విరాళాన్ని రేవంత్ తిరిగి ఇచ్చేశారు. సీక్రెట్‌గా తీసుకోవడం దొరికినప్పుడే వాటిని ఇచ్చేయడం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇదేనా?
ఇది అంతటితో ఆగలేదు. క్యాబినెట్ మంత్రులైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లో భూముల ఒప్పందాలను ఖరారు చేసేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులను స్టార్ హోటళ్లలో కలిశారు. ఈ బ్యాక్‌రూమ్ డీలింగ్‌లు మీ పబ్లిక్ స్టంట్‌లకు విరుద్ధంగా ఉంటోంది.
ఒకవైపు మీరు అదానీని అవినీతికి చిహ్నంగా చూపించి, ఆయనను మోడీ 'క్రోనీ క్యాపిటలిస్ట్' అని అంటున్నారు. మరోవైపు అదే అదానీని తెలంగాణలోని మీ ముఖ్యమంత్రి, మంత్రులు కౌగిలించుకుంటున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణం, నిజంగా అదానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందా లేదా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందాఅనే అనుమానం కలుగుతుంది.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా లేక బీజేపీకి, దాని కార్పొరేట్ మిత్రులకు ప్రాక్సీగా వ్యవహరిస్తున్నారా? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ, దేశ ప్రజలు గమనిస్తున్నారు. మీరు వచ్చి మీ వైఖరిని స్పష్టం చేయాల్సిన సమయం ఇదే.
అదానీతో 'దోస్తీ'పై మీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారా లేదా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం మౌనంగా ఉంటారా? దీన్ని తెలంగాణ ప్రజలు ఇక సహించరు. అని కేటీఆర్ రాసుకొచ్చారు.
Also Read: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు