Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు
Telangana News: గురుకులాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో రెండు ఘటనలు చెబుతున్నాయి. ఒక చోట ఆరుగురు విద్యార్థులను పాము కాటేసింది. మరో చోట విద్యార్థిని ఎలుకలు కొరికాయి.
Telangana Gurukula Schools News: తెలంగాణ గురుకుపాఠశాలలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థులను, తల్లిదండ్రులను ఆసుపత్రులకు పరుగుల పెట్టించాయి. ఇప్పుడు మరో సమస్య వారిని వెంటాడుతోంది. విష సర్పాలు కాటేసి చంపుతున్నాయి. ఎలుకలు కొరికి చిత్రవధ చేస్తున్నాయి. మొత్తానికి గురుకుల పాఠశాలలు, హాస్టల్స్‌లో ఉండాలంటే విద్యార్థులు భయపడిపోతున్నారు.
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఈ మధ్య కాలంలో పాము కాటుకు విద్యార్థులు బలి అవుతున్నారు. ఇవాళ(19 డిసెంబర్ 2024 )ఉదయం యశ్విత్ అనే విద్యార్థికి పాము కాటేసింది. ఇప్పటి వరకు పాఠశాలలో సుమారు ఆరుగురిని పాము కాటు వేసింది. అయిన అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
పాముకాటుకు గురైన యశ్విత్‌ను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం(18 డిసెంబర్ 2024)ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కాటేసింది. ఈ ఇద్దరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పాఠాశాలలో ఆరుగురు విద్యార్థులను పాము కాటు వేసింది. వారిలో ఇద్దరు చనిపోయారు.
మరోవైపు ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థినికి ఎలుకలు కరిచాయి. ఒకసారి రెండుసార్లు కాదు ఏకంగా 15సార్లు ఎలుకలు కరిచినట్టు విద్యార్థి చెబుతోంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ కీర్తి అనే విద్యార్థిని పగబట్టినట్టు ఎలుకలు కరిచాయి. అయినా అధికారులు స్పందించలేదని హరీష్ విమర్శలు చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థినిని ప్రాణాల మీదికి తెచ్చింది.
— Harish Rao Thanneeru (@BRSHarish) December 17, 2024
మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ కీర్తి
అనే విద్యార్థిని 15 సార్లు ఎలుకలు కొరికితే అధికారులు ఏం చేసున్నట్లు?
అనేక సార్లు ఆసుపత్రికి వచ్చినా ఎందుకు… pic.twitter.com/p5Kk1wSfCe
అనేక సార్లు ఆసుపత్రికి వచ్చినా ఎందుకు సరైన వైద్యం అందించలేదని వైద్యాధికారులను హరీష్ నిలదీశారు. తీవ్ర అనారోగ్యంపాలై మంచం పడితే అధికారులు ఏం చేస్తున్నట్లు? అనిప్రశ్నించారు. అనేకసార్లు రాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాళ్లు చచ్చు పడిపోయాయని దారుణమైన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.
గురుకులాల్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే గురుకుల బాటతో పేరుతో ఒక్కరోజు ప్రచారం చేసి చేతులు దులుపుకున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు హరీష్. కాంగ్రెస్ పాలనలో బడిలో పాఠాలు వినాల్సిన పిల్లలు, అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హరీష్ విజ్ఞప్తి చేశారు. తీవ్రంగా అనారోగ్యం పాలైన లక్ష్మీ భవానీ కీర్తిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి అత్యుత్తమ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఎలుకలు కొరికిన ఇతర విద్యార్థుల ఆరోగ్యాలు సంరక్షించాలని, మంచి వైద్యం అందించాలని కోరుతున్నామన్నారు.
సీఎం హోదాలో పీవీ నరసింహారావు 1971లో ప్రారంభించిన మొదటి గురుకుల పాఠశాలలో కూడా సమస్యలు ఉన్నాయన్నారు హరీష్. యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్‌లో విద్యార్థినితో వంట చేయించారని మండిపడ్డారు. ఆ క్రమంలోనే రాగి జావ ఆ విద్యార్థిపై పడిందని వీడియోలు ఫొటోలు ఎక్స్‌లో పోస్టు చేశారు. తీవ్రంగా గాయపడి ఆ బాలిక ఆసుపత్రి పాలైన పరిస్థితి ఉందని వాపోయారు.
తెలంగాణ గురుకులాల్లో జరుగుతున్న దారుణాలకు ఇది మరో నిదర్శనం.
— Harish Rao Thanneeru (@BRSHarish) December 18, 2024
1971లో ముఖ్యమంత్రి హోదాలో దివంగత పీవీ నరసింహారావు గారు దేశంలో మొదటి గురుకులన్ని యాదాద్రి భువనగిరి జిల్లా, సర్వేల్ లో ప్రారంబించారు.
నేడు అదే గురుకులంలో విద్యార్థినితో వంట చేయిస్తే, వేడి రాగి జావ పడి ఆ విద్యార్థి… pic.twitter.com/6acm94mF2T
ఒకవైపు అసెంబ్లీలో గురుకులాలపై చర్చ జరుగుతున్న టైంలోనే ఇలాంటివి జరగడం దారుణం అన్నారు. గురుకులల్లో దారుణమైన పరిస్థితుల గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండని ప్రభుత్వానికి హరీష్ సూచించారు. రోజురోజుకి దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని కాపాడండని విజ్ఞప్తి చేశారు.