Gold Rate: పసిడి వ్యాపారుల ఆటలకు అడ్డుకట్ట, త్వరలో "ఒకటే దేశం ఒకటే గోల్డ్ రేటు" పాలసీ
Gold Price: దేశవ్యాప్తంగా పసిడి ధరలను ఒకేలా ఉండేలా చేసేందుకు కేంద్రం కొత్తగా ఒకటే దేశం ఒకటే గోల్డ్ రేటు పాలసీని అమలులోకి తీసుకొస్తోంది. దీనికోసం ఇప్పటికే జ్యువెలరీ పరిశ్రమతో సంప్రదింపులు జరుపుతోంది.
One Nation One Gold Rate: భారతీయులు సహజంగానే పసిడి ప్రియులు. అయితే దీనినే దేశంలోని కొందరు పసిడి వ్యాపారులు తమ పబ్బం గడుపుకునేందుకు చాలా కాలంగా వినియోగించుకుంటున్నారు. వేరువేరు ప్రాంతాల్లో వ్యాపారులు వివిధ రేట్లకు గోల్డ్ విక్రయిస్తూ ప్రజలను మాయ చేస్తున్నారు. దీంతో చాలా మందికి సహజంగా ఉండే అనుమానం ఎందుకు రేట్లలో తేడా ఉంటుందనే. అయితే దీనిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది.
త్వరలో వన్ నేషన్ వన్ గోల్డ్ రేటు పాలసీ
దేశంలో పసిడి విక్రయాల్లో పారదర్శకతను తీసుకురావటానికి భారత ప్రభుత్వం కొత్తగా వన్ నేషన్ వన్ గోల్డ్ రేటు పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిపై ఇండియన్ జువెలర్స్ అండ్ బులియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(IBJA), ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ పరిశ్రమలోని వివిధ వాటాదారులతో చర్చలు జరుపుతున్నాయి. కొత్త విధానాన్ని సెప్టెంబర్‌లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నందున దీనిపై త్వరలోనే ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విధానం అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒకే స్థాయిలో కొనసాగుతాయి. అంటే ఎవరైనా వ్యక్తి దేశంలో ఏ మూలన బంగారం కొనాలన్నా దాని ధర ఒక్కటిగా ఉంటుంది.
ధరల ఏకీకృతం కోసం కొత్త పాలసీ
వాస్తవానికి బంగారం ధర ప్రారంభంలో US డాలర్లలో ఉండేది. భారత్ తన బంగారం అవసరాల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడటం వల్ల.. కరెన్సీ మారకం రేటు, వివిధ సుంకాలు దేశీయంగా బంగారం ధరను మరింత ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా డాలర్ బలపడితే దేశీయంగా బంగారం ధరలు పెరుగుతాయి. అయితే ప్రస్తుతం దేశీయంగా పసిడి ధరలను దేశవ్యాప్తంగా ఏకీకృతం చేసేందుకు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నందున రానున్న కాలంలో వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెరుగుతుందని ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ సయం మెహ్రా అభిప్రాయపడ్డారు. అలాగే వ్యత్యాసాలు తగ్గి మార్కెట్లో వ్యాపారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వస్తుందని అభిప్రాయపడ్డారు.
వాస్తవానికి లాజిస్టికల్ ఖర్చులు, విభిన్న డిమాండ్, సరఫరా డైనమిక్స్‌లో తేడాల కారణంగా బంగారం ధరలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నగరాల్లో మారుతూ ఉంటాయి. ఈ కారకాలు ధరలో అసమానతలను సృష్టిస్తాయి. ఏకీకృత ధరల విధానం ఈ సమస్యలను పరిష్కరించి దేశవ్యాప్తంగా స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. ఇప్పటికే తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఆభరణాల పరిశ్రమ GSTతో సహా పారదర్శకత చర్యలను అవలంబించడం, తప్పనిసరి హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు సంఖ్యలను అమలు చేయడంలో వేగంగా ముందుకు సాగుతోంది. అలాగే దేశవ్యాప్తంగా ఒకే గోల్డ్ రేటును తీసుకొచ్చేందుకు ప్రస్తుతం వివిధ పరిశ్రమల సంఘాలతో చర్చలు జరుగుతున్నాయని, వారి నుంచి స్పందన కూడా సానుకూలంగా ఉందని IBJA జాతీయ ప్రతినిధి కుమార్ జైన్ తెలిపారు.
Also Read: మీ దగ్గర స్టార్ గుర్తు ఉన్న 500 నోట్లు ఉన్నాయా! ఆ వైరల్ న్యూస్‌పై కేంద్రం క్లారిటీ
ఏడాది చివరికి కొత్త విధానం
అన్ని సవ్యంగా జరిగితే ఈ ఏడాది చివరిలోపు కనీసం దేశంలోని ప్రముఖ గోల్డ్ జ్యువెలరీ వ్యాపారుల ద్వారా అయినా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు కుమార్ జైన్ పేర్కొన్నారు. సెప్టెంబరు సమావేశంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది మార్కెట్లో పసిడి విక్రయాల్లో ధరల మాయాజాలం ప్రదర్శించి కొనుగోలుదారులను మోసం చేస్తున్న వ్యాపారులను అరికట్టేందుకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: కొడుకు పెళ్లి కోసం అంబానీ ఎంత ఖర్చు చేశారో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు