World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
World's Worst Tsunami: సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజున రాకాసి అలలు ఎందరి జీవితాలనో అల్లకల్లోలం చేశాయి. హిందూ మహాసముద్రంలో సునామీ మిగిల్చిన కన్నీటి విషాదం ఇదీ..
World's Worst Tsunami: 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం అల్లకల్లోలం సృష్టించింది. డజనుకు పైగా దేశాల్లో 2,20,000 కంటే ఎక్కువ మందిని బలిగొన్న ఈ సునామీకి నేటితో 20 ఏళ్లు పూర్తైంది. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం పశ్చిమ తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా భారీ అలలు ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్, హిందూ మహాసముద్ర బేసిన్ చుట్టూ ఉన్న 9 ఇతర దేశాల తీర ప్రాంతాల్లోకి వచ్చాయి. కొన్ని నివేదికల ప్రకారం హిందూ మహాసముద్రంలో ఈ భూకంపం 10 నిమిషాలకు పైగా సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 9.1గా నమోదైంది. 120 అడుగుల పెద్ద అలలతో బీభత్సం సృష్టించిన ఈ భూకంపం పేరు చెబితే.. ఆనాటి రోజులను చూసిన వారు ఇప్పటికీ వణికిపోతుంటారు.
ఈ సునామి దాటికి కేవలం ఇండోనేషియాలోనే లక్ష 70 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమత్ర దివుల్లో శకలాలు మాత్రమే మిగిలాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే 107, కేరళ 177, తమిళనాడులో 8009, పాండిచ్చేరిలో 599, అండమాన్ నికోబార్ దీవుల్లో దాదాపు 3513 మంది మృత్యువాత పడ్డారు.
భారీ విపత్తుకు 20 ఏళ్లు
డిసెంబర్ 26, 2004లో వచ్చిన సునామీ ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. ఇప్పటికీ ఆ రాకాసి అలలు తమ కళ్ల ముందే మెదలాడుతున్నాయని.. ఆ భయానక దృశ్యాలు గుర్తొచ్చినప్పుడల్లా ఆందోళన ఎక్కువవుతుందని అప్పటి సునామీ బాధితులు ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అలల విధ్వంసానికి ఎత్తైన భవనాలు సైతం క్షణాల్లో నేలకూలిపోయాయి. అప్పట్లో హిందూ మహా సముద్రంలో ఎలాంటి హెచ్చరిక వ్యవస్థ లేదు. దీని వల్ల భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. థాయిలాండ్‌లోని సముద్ర తీర హోటళ్లు, రిసార్ట్‌లకు వచ్చిన టూరిస్టులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ప్రసిద్ధ దేవాలయాలు, స్టేడియం వంటివి కూడా ఈ సునామీ ధాటికి కుప్పకూలిపోయాయి. కేవలం తమిళనాడు నాగపట్టణంలోనే 6 వేల మందికి పైగా మరణించారు.
ఘోర విషాదం మిగిల్చిన..
- గ్లోబర్ డిజాస్టర్ డేటాబేస్ EM-DAT ప్రకారం, ఈ సునామీ కారణంగా మొత్తం 2,26,408 మంది మరణించారు.
- ఈ సునామీకి అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లో సుమత్రా ఒకటి. మొత్తం 1,65,708 మంది మరణించగా, ఇండోనేషియాలో మాత్రం 1,20,000 కంటే ఎక్కువ చనిపోయారు.
- భారీగా వీచిన అలలు క్రమక్రమంగా హిందూ మహాసముద్రం చుట్టూ ప్రవహించాయి. కొన్ని గంటల తర్వాత శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్‌లను తాకాయి.
- అత్యంత వేగంగా వ్యాపించిన ఈ అలలు గంటకు 800 కిలోమీటర్ల (500 mph) వేగంతో ప్రయాణించాయి. ఇది బుల్లెట్ రైలు కంటే రెండింతలు ఎక్కువ.
- EM-DAT ప్రకారం, శ్రీలంకలో 35,000 మందికి పైగా మరణించారు. భారతదేశంలో 16,389 మంది, థాయ్‌లాండ్‌లో 8,345 మంది మరణించారు.
- సోమాలియాలో దాదాపు 300 మంది, మాల్దీవుల్లో 100 మందికి పైగా, మలేషియా, మయన్మార్‌లలో డజన్ల కొద్దీ మరణించారు.
కనుమరుగైన అందాలు..
సునామీకి ముందు పర్యాటకులకు స్వర్గధామంగా ఉన్న సుమత్రా దీవులు, తర్వాతి కాలంలో వాటి రూపురేఖలనే కోల్పోయాయి. చాలా ఏళ్ల పాటు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సందర్శకులు కూడా భయపడిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు సునామీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో. ఇప్పుడిప్పుడే నివాసాలు, రిసార్టులు, మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సముద్రానికి కిలోమీటర్ అవతల మాత్రమే ఏర్పాటు చేసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నటు తెలిపారు. మత్స్యకారులు మాత్రం తమ జీవనోపాధిని దృష్టిలోపెట్టుకొని తీరం సమీపానికి చేరుకున్నారు. వారిలో సునామీ తాలూకూ భయాన్ని తొలగించేందుకు అధికారులు, ఏటా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం.
Also Read : UK Sharia: యూకే లో శరవేగంగా పెరుగుతున్న షరియా కోర్టులు, ముస్లిం జనాభా - ఇస్లామిక్ దేశంగా మారబోతోందా ?