Fruit Juice: జనం చెవుల్లో ఫూట్ర్ పెట్టొద్దు, జ్యూస్ ప్యాకెట్లపై ఆ నంబర్ తీసేయండి
FSSAI Order: ఈ రసాలన్నింటిలో అధిక శాతం నీరు ఉంటుంది. దానికి కొద్ది మొత్తంలో పండ్ల రసం లేదా గుజ్జు కలిపితే 100 శాతం పండ్ల రసంగా మారదు.
FSSAI New Order On Fruit Juice: రియల్ ఫ్రూట్ జ్యూస్ పేరుతో అనేక రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్న పానీయ కంపెనీలకు గట్టి షాక్ తగిలింది. ప్యాక్ చేసి అమ్ముతున్న పానీయ ఉత్పత్తులను (Canned Products) "100% పండ్ల రసం" పేరిట ప్రచారం చేయవద్దని 'భారత ఆహార భద్రత & ప్రమాణాల సంస్థ' (Food Safety and Standards Authority of India లేదా FSSAI) అన్ని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేటప్పుడు, వ్యాపార ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా అలాంటి క్లెయిమ్‌లు చేయవద్దని సూచించింది. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని FSSAI అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను (FBOs) కోరింది.
జ్యూస్ ప్యాకెట్ల లేబుళ్లపైన & ప్రకటనల్లో కూడా తొలగించాలి
'భారత ఆహార భద్రత & ప్రమాణాల సంస్థ' జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఆహార వ్యాపారంలో పాల్గొంటున్న అన్ని కంపెనీలు పండ్ల రసం ప్యాకెట్ల లేబుళ్లపై "100% పండ్ల రసం" (100% Fruit Juice) పదాలను ముద్రించకూడదు. ఇప్పటికే తయారైన ఉత్పత్తుల ప్యాకింగ్‌పై ఆ పదాలు ఉంటే, వాటిని ఈ ఏడాది సెప్టెంబరు 01 లోగా తొలగించాలి. వ్యాపార ప్రకటనల సమయంలోనూ ఆయా ఉత్పత్తులను "100% పండ్ల రసం" అని ప్రచారం చేయకూడదు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఇలాంటి తప్పుదోవ పట్టించే వాదనలు చేస్తున్నాయని FSSAIకి సమాచారం అందింది. "100% పండ్ల రసం" అని నమ్మి, ఆయా ఉత్పత్తులను కొంటున్న వినియోగదార్లు మోసపోతున్నారు & వారి ఆరోగ్యం దెబ్బతింటోంది.
ఆహార భద్రత & ప్రమాణాలు (ప్రకటనలు & దావాలు) నిబంధనలు- 2018 ప్రకారం, ఏ కంపెనీ కూడా 100 శాతం పండ్ల రసాన్ని క్లెయిమ్ చేయకూడదు. వాస్తవానికి, ఈ రసాలన్నింటిలో అధిక శాతం నీరు ఉంటుంది. దానికి కొద్ది మొత్తంలో పండ్ల రసం లేదా గుజ్జు కలిపితే 100 శాతం పండ్ల రసంగా మారదు. కాబట్టి, వినియోగదార్లను తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లు చేయడం, ఇటువంటి ప్రకటనలు ఇవ్వడం పూర్తిగా నిలిపేయాలని FSSAI ఆదేశించింది.
చక్కెర ఎక్కువగా ఉంటే స్వీట్ జ్యూస్‌గా ప్రకటించాలి
అన్ని FBOలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ నియమాల ప్రకారం పని చేయాలని FSSAI సూచించింది. పండ్ల రసం పేరిట అమ్ముతున్న ఉత్పత్తిలో కిలోకు 15 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర ఉంటే, ఆ ఉత్పత్తిని తియ్యటి పానీయం (Sweet Juice) అని పేర్కొంటూ లేబుల్ రూపొందించాలి.
ఆహార భద్రత నియమాలను కఠినంగా అమలు చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు FSSAI తెలిపింది. తప్పుడు క్లెయిమ్ ద్వారా వినియోగదార్లకు హాని కలిగించడానికి తాము ఏ కంపెనీని అనుమతించబోమని తెలిపింది. పండ్ల రసాలకు సంబంధించి రూపొందించిన నిబంధనలను అన్ని కంపెనీలు కచ్చితంగా పాటించాల్సిందేనని FSSAI స్పష్టం చేసింది.
మరో ఆసక్తిర కథనం: ఓటింగ్ పూర్తికాగానే ధరాఘాతం - పెరిగిన పాల రేట్లు - పెరగనున్న పెట్రోల్, మొబైల్ బిల్లులు!