Petrol Vs Electric Scooters: పెట్రోల్ స్కూటర్ Vs ఎలక్ట్రిక్ స్కూటర్.. మీ డబ్బు ఆదా చేసేది ఏదో తెలుసా?
Petrol Scooters Vs Electric Scooters:పెట్రోల్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏదీ కొనడం వల్ల మీ డబ్బు ఆదా అవుతుందో తెలుసుకోవాలని ఉందా? ఈ రెండు వెర్షన్‌ల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఈ కథనంలో..
Petrol Scooters Vs Electric Scooters: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వీటి అమ్మకాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా రాయితీలు, పన్ను ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయినప్పటికీ పెట్రోలు (ICE) ద్విచక్ర వాహనాలు ఇప్పటికీ మార్కెట్‌లో ఎక్కువగా సేల్ అవుతున్నాయి. జనాలు వీటికి అలవాటు పడటమే దీనికి ముఖ్య కారణంగా ఉంది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు పెట్రోల్ స్కూటర్ కొనాలనే విషయంలో అయోమయంలో ఉన్నారా? అయితే ముందుగా మీ రోజువారీ ప్రయాణ దూరాన్ని పరిగణనలోకి తీసుకోండి. ఆ తర్వాతే మీకు నచ్చిన వెర్షన్‌ని ఎంచుకోండి.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు:
నేడు అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరలోనూ ఎక్కువ రేంజ్ (మైలేజీ)ని అందిస్తున్నాయి. ప్రతీ కంపెనీ ఫుల్ ఛార్జింగ్‌తో కనీసం 100 కిలోమీటర్లు ప్రయాణించగల మోడల్‌ను అందిస్తున్నాయి. కాబట్టి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేసే వారు ఎవ్వరైనా సరే 100 కి.మీ కంటే తక్కువ రేంజ్ అందించే స్కూటర్లను కొనుగోలు చేయవద్దు. స్కూటర్లను కొనేముందు ఛార్జింగ్ సమయం, బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్స్‌ని కచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే దీనికి జీవనాధరమైన బ్యాటరీలో ఛార్జింగ్ అనేది చాలా ముఖ్యం.
పెట్రోల్ స్కూటర్ల వల్ల ప్రయోజనాలు:
పెట్రోల్ స్కూటర్లను నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే దేశంలో పెట్రోల్ బంకులు విస్తృతంగా ఉన్నందున ఎటువంటి సమస్య, భయం ఉండదు. రహదారులపై, సాధారణంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పెట్రోల్ బంకు అందుబాటులో ఉంది. సిటీలలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సౌలభ్యం అంతరాయం లేని ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్లను పూర్తిగా ఛార్జ్ చేయడానికి గంటలు పడుతుంది. ఛార్జింగ్ స్టేషన్ల లభ్యత కూడా పరిమితంగా ఉంటుంది.
సమస్యలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ, ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య ఎక్కవగా లేదు. ఛార్జింగ్ పాయింట్ల సంఖ్యను పెంచడానికి వివిధ కంపెనీలు మరియు ప్రభుత్వ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇది ప్రస్తుతం కేవలం ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే కొనసాగుతుంది. అందువల్ల, ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే ముందు మీ ప్రాంతంలో ఛార్జింగ్ స్టేషన్ల అవెలైబిలిటీని కనుక్కోవడం ఉత్తమం.
ఇక బ్యాటరీ మార్పిడి (Battery Swapping) కేంద్రాలు ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందిస్తాయి. వీటిలో పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీలు లభిస్తాయి. అయితే, ఈ కేంద్రాలు దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో ఉన్నాయి, ఈ నెట్‌వర్క్‌ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది.
ఖర్చు
ఖర్చు పరంగా పెట్రోల్ స్కూటర్‌ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్‌ల వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు లీటరుకు 50 కి.మీ మైలేజీనిచ్చే పెట్రోల్ స్కూటర్ ప్రయాణించాలంటే కిలోమీటరుకు దాదాపు రూ.2 ఖర్చు అవుతుంది. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్లు కిలోమీటరుకు 50 పైసల కంటే తక్కువ ధరతో కిలోమీటర్ దూరం ప్రయాణిస్తాయి. కొన్ని టాప్ మోడళ్లలో కిలోమీటరుకు కేవలం 10-20 పైసల ఖర్చు మాత్రమే అవుతుంది.
పెట్రోలు స్కూటర్లకు ఆయిల్ ఛేంజ్, ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్మెంట్స్, ఇతర పార్ట్స్‌కి కనీసం 90 రోజులకు ఒకసారి భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. ఇంకా కీలకమైన ఇంజిన్, ఇతర భాగాలు దెబ్బతింటే ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ పార్ట్స్‌ని కలిగి ఉంటాయి. అందువల్ల వీటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ.
అంతేకాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలుష్య కారకాలను విడుదల చేయవు. ఇవి పర్యావరణ అనుకూలమైనవిగా ఉంటాయి. ఎలక్ట్రిక్ స్కూటర్,, పెట్రోల్ స్కూటర్లో ఏదీ తీసుకోవాలనే నిర్ణయం వ్యక్తిగత అవసరాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లు మీ డబ్బుని 30-50 శాతం వరకు ఆదా చేస్తాయి. హై ఫర్ఫామెన్స్, ఎటువంటి భయం లేకుండా ప్రయాణించాలంటే పెట్రోల్ స్కూటర్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.