Volvo EX60 లాంచ్: భారీ బ్యాటరీతో 810km రేంజ్, ప్రీమియం ఫీచర్లతో వచ్చిన లగ్జరీ ఎలక్ట్రిక్ SUV
కొత్త Volvo EX60 ఎలక్ట్రిక్ SUV యూరప్‌లో విడుదలైంది. 117kWh బ్యాటరీతో 810 కిలోమీటర్ల రేంజ్, SPA3 ప్లాట్‌ఫామ్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లతో ప్రీమియం సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది.

Volvo EX60 Electric SUV Price And Features: వోల్వో, తన కొత్త ఎలక్ట్రిక్ SUV Volvo EX60ను యూరోపియన్ మార్కెట్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. ఇది, పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాల కోసం వోల్వో ప్రత్యేకంగా డెవలప్ చేసిన SPA3 ప్లాట్‌ఫామ్‌పై తయారైన తొలి మోడల్ కావడం విశేషం. ఇప్పటివరకు డీజిల్, పెట్రోల్ ఇంజిన్‌లతో పేరు తెచ్చుకున్న XC60కి ఇది ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయంగా వచ్చిన SUV. యూరప్ తర్వాత అమెరికా మార్కెట్‌లోనూ EX60ను ప్రవేశపెట్టే యోచనలో వోల్వో ఉంది.
డిజైన్ ఎలా ఉంది?
Volvo EX60 బయట నుంచి చూస్తే చిన్న EX30కి పెద్ద సైజ్ వెర్షన్‌లా కనిపిస్తుంది. ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, వోల్వోకి సిగ్నేచర్ అయిన ‘థోర్స్ హ్యామర్’ LED DRL డిజైన్ ఆకర్షణగా నిలుస్తుంది. గ్రిల్ పూర్తిగా క్లోజ్డ్‌గా ఉండటం, కింద భాగంలో బ్లాక్ స్కఫ్ ప్లేట్ ఇవ్వడం SUV తరహాలో ఉండే లుక్‌ను మరింత బలంగా చూపిస్తుంది.
సైడ్ ప్రొఫైల్‌లో మృదువైన బాడీ లైన్స్, వీల్ ఆర్చ్‌లపై షార్ప్ క్యారెక్టర్ లైన్స్ కనిపిస్తాయి. డోర్ల కింద భాగంలో బ్లాక్ క్లాడింగ్ ఉండటంతో పాటు, సంప్రదాయ డోర్ హ్యాండిల్స్ స్థానంలో విండో లైన్‌పై అమర్చిన ఇల్లుమినేటెడ్ వింగ్ గ్రిప్ హ్యాండిల్స్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ. 20 ఇంచ్‌ల నుంచి 22 ఇంచ్‌ల వరకు వీల్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వెనుక భాగంలో స్లిమ్ LED టెయిల్ లైట్స్, బ్లాక్ స్ట్రిప్, సిల్వర్ టచ్‌తో ప్రీమియం ఫీల్ కనిపిస్తుంది.
క్రాస్ కంట్రీ వెర్షన్ ప్రత్యేకత
EX60లో ప్రత్యేకంగా క్రాస్ కంట్రీ వెర్షన్‌ను కూడా అందిస్తున్నారు. దీనికి 20 మిల్లీమీటర్లు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, స్టెయిన్‌లెస్ స్టీల్ స్కిడ్ ప్లేట్స్, మ్యాట్ బ్లాక్ క్లాడింగ్, ప్రత్యేకమైన ఫ్రోస్ట్ గ్రీన్ కలర్ ఇస్తారు. అదనంగా ఆఫ్‌రోడ్ మోడ్‌తో కూడిన అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ ఇందులో ఉంటుంది.
ఇంటీరియర్ & ఫీచర్లు
క్యాబిన్‌లోకి అడుగు పెట్టగానే లేయర్డ్ డ్యాష్‌బోర్డ్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ కనిపిస్తాయి. 2 స్పోక్ స్టీరింగ్ వీల్‌పై ఫిజికల్ బటన్స్ ఇవ్వడం డ్రైవింగ్‌ను సులభంగా చేస్తుంది. 11.4 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 15 ఇంచ్ Android ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణలు.
హీటెడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీట్ మెమరీ ఫంక్షన్, ADAS, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆడియో ప్రేమికుల కోసం 21 స్పీకర్ Bose సిస్టమ్ స్టాండర్డ్‌గా, కావాలంటే 28 స్పీకర్ Bowers & Wilkins సిస్టమ్ ఎంపికగా ఇస్తారు. గూగుల్ జెమినీ AI అసిస్టెంట్, OTA అప్‌డేట్స్ కూడా ఉన్నాయి.
బ్యాటరీ & రేంజ్ వివరాలు
Volvo EX60ను మూడు వేరియంట్లలో అందిస్తున్నారు.
P6 Electric: 83kWh బ్యాటరీ, రియర్ మోటర్, 374hp శక్తి, 480Nm టార్క్, 620 కిలోమీటర్ల రేంజ్
P10 AWD: 95kWh బ్యాటరీ, డ్యూయల్ మోటర్, 510hp, 710Nm, 660 కిలోమీటర్ల రేంజ్
P12 AWD: 117kWh బ్యాటరీ, 680hp, 790Nm, గరిష్టంగా 810 కిలోమీటర్ల రేంజ్
400kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 20 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. AC ఛార్జింగ్‌కు 22kW వరకు సపోర్ట్ ఉంటుంది.
భారత్‌లోకి వస్తుందా?
BMW iX3, Mercedes-Benz GLC EVలకు ప్రత్యర్థిగా Volvo EX60 నిలుస్తుంది. భారత్‌లో విడుదలపై ఇప్పటివరకు వోల్వో అధికారిక ప్రకటన చేయలేదు. అయితే రానున్న రోజుల్లో EX90, ES90 ఎలక్ట్రిక్ మోడళ్లను భారత్‌కు తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















