Independence Day 2025: 4 కాన్సెప్ట్ SUVలు ఆవిష్కరించిన మహీంద్రా - చూపు తిప్పుకోనివ్వని డిజైన్స్ గురూ!
Mahindra New SUV Concepts: 2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, 4 SUV కాన్సెప్ట్‌లను మహీంద్రా & మహీంద్రా ఆవిష్కరించింది, అవి - Vision S, Vision X, Vision T, Vision SXT.

Independence Day 2025 Mahindra Concept Cars: ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా, కంపెనీ భవిష్యత్తు డిజైన్లు & టెక్నాలజీని ప్రతిబింబించే 4 సరికొత్త SUV కాన్సెప్ట్‌లను ఆవిష్కరించింది. మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కాంపాక్ట్ & మిడ్ రేంజ్ SUV విభాగాల్లో మహీంద్రా ఉనికిని బలోపేతం చేయడం ఈ కొత్త SUVల లక్ష్యం. ఈ అద్భుతమైన డిజైన్లతో పాటు, మహీంద్రా తన తదుపరి తరం మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌ను కూడా పరిచయం చేసింది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెట్రోల్ - మూడు రకాల పవర్‌ట్రెయిన్‌లను సులభంగా సపోర్ట్ చేయగల ఫ్లెక్సిబుల్ డిజైన్‌లో ఈ ఫ్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. దీని అర్ధం.. మహీంద్రా భవిష్యత్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ & పెట్రోల్ కార్లు ఈ ఫ్లాట్‌ఫామ్‌ను బేస్ చేసుకుని తయారవుతాయి.
2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, మహీంద్రా ఆవిష్కరించిన 4 SUV కాన్సెప్ట్ SUVలు - Vision S, Vision X, Vision T, Vision SXT.
Vision S – మహీంద్రా చరిత్రలో అతి చిన్న SUV

Vision S ఒక సబ్-4 మీటర్ SUV. ఇది రోడ్డుపైకి వస్తే, మహీంద్రా నుంచి వచ్చిన అతి చిన్న SUV అవుతుంది. సిటీ ట్రాఫిక్‌లో చురుకుదనం, SUV స్టాన్స్, ఈ రెండిటినీ మిక్స్ చేస్తూ రూపొందిస్తారు. అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఫ్లాట్ ఫ్లోర్, ఇంటీరియర్ స్పేస్‌ను తెలివిగా వినియోగించుకోవడం వంటి లక్షణాల కారణంగా నగర ప్రయాణికులకు ప్రాక్టికల్ మైక్రో SUV అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో మహీంద్రా SUVలకు ప్రత్యేకమైన 'గంభీరమైన అప్పీల్' (rugged appeal) పోకుండా డిజైనింగ్ ఉంటుంది.
Vision X – స్టైలిష్ క్రాస్-ఓవర్ ఆఫర్

సాంప్రదాయ SUV లైన్స్‌కు భిన్నంగా, Vision X మరింత స్లీక్, స్పోర్టీ లుక్స్‌తో వస్తుంది. ఎయిరోడైనమిక్ డిజైన్, కూపే స్టైల్, లైఫ్‌స్టైల్ వంటివన్నీ ఈ మోడల్‌లో కలుస్తాయి. SUV వెర్సటిలిటీలోనే మోడ్రన్ డిజైనింగ్ కోరుకునే యువత డ్రైవింగ్ స్టైల్‌కు ఈ SUV సరిగ్గా సరిపోతుంది. ఈ మోడల్ ద్వారా, మహీంద్రా తన SUV పోర్ట్‌ఫోలియోను బాక్సీ షేప్స్‌కు మించి విస్తరించనుందని స్పష్టం అవుతోంది.
Vision T – భవిష్యత్తు థార్ రూపం

Vision T అనేది, ప్రస్తుత Mahindra Thar కు ఫ్యూచరిస్టిక్ టచ్ ఇచ్చిన కాన్సెప్ట్. బలమైన డిజైన్ ఎలిమెంట్స్, మస్క్యులర్ వీల్ ఆర్చెస్, బోల్డ్ డిటైలింగ్ - అన్నీ Vision T లోనూ మహీంద్రా ఆఫ్-రోడ్ DNAను కొనసాగిస్తాయి. అదే సమయంలో, దీనిని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లో తీసుకువచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మోడల్ థార్ వారసత్వాన్ని కొత్త యుగంలోకి తీసుకెళ్లి, అడ్వెంచర్ సామర్థ్యం, ఆధునిక కంఫర్ట్‌ను కలిపి అందించబోతుంది.
Vision SXT – ప్రీమియం SUV వైపు అడుగు

నాలుగు కాన్సెప్ట్‌లలో అత్యంత ప్రీమియంగా నిలిచేది Vision SXT. కంఫర్ట్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, రోడ్ ప్రెజెన్స్ మీద ఇది దృష్టి పెడుతుంది. మిడ్ లెవెల్ SUVగా, బలమైన ప్రపోర్షన్స్ & ఫీచర్ రిచ్ క్యాబిన్‌తో వస్తుంది. పెర్ఫార్మెన్స్, ప్రాక్టికాలిటీ, సొఫిస్టికేషన్‌ను ఒకే SUVలో కోరుకునే బయ్యర్స్ కోసం ఇది డిజైన్ చేశారు.
భవిష్యత్ ప్లాట్‌ఫామ్
ఈ నాలుగు కాన్సెప్ట్‌లు మహీంద్రా కొత్త మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నాయి. ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌లను సపోర్ట్ చేసేలా దీనిని రూపొందించారు. 4 మీటర్ల లోపు (సబ్-4 మీటర్) నుంచి 4.6 మీటర్ల వరకు పొడవు కలిగిన ఈ SUVలు, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన ఇంటీరియర్, ఫ్లాట్ ఫ్లోర్ లేఅవుట్‌తో వస్తాయి.
లాంచ్ టైమ్‌లైన్
‘Vision 2027’ పేరుతో ఈ కాన్సెప్ట్ SUVలను మహీంద్రా లాంచ్ చేసింది. ఈ వెర్షన్లు మార్కెట్‌లోకి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) SUV సెగ్మెంట్‌లో కాంపాక్ట్, మిడ్‌సైజ్ SUVలతో పోటీ పడేలా వీటిని ప్లాన్ చేశారు. బెటర్ ఎఫిషెన్సీ, కాలానికి తగ్గ డిజైన్, విస్తృత వెర్సటిలిటీతో భారత SUV మార్కెట్లో ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది.





















