ఇండియా-EU ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ఆటో సెక్టార్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది, కార్ల ధరలు తగ్గుతాయా?
ఇండియా-యూరోప్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల కార్ల ధరలు తగ్గే అవకాశముందా? ఆటో రంగంపై ప్రభావం, దిగుమతి పన్నులు, ఎలక్ట్రిక్ కార్లపై నియమాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

India EU Trade Agreement Auto Sector: భారతదేశం - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య ఎన్నో ఏళ్లుగా సాగుతున్న చర్చలకు చివరికి ముగింపు పడింది. ఈ రెండు పక్షాలు కలిసి ఒక చారిత్రాత్మకమైన "ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA)"కు అంగీకారం తెలిపాయి. దీనిని చాలా మంది “మదర్ ఆఫ్ ఆల్ డీల్స్” అని కూడా పిలుస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి పెరుగుతున్న ఈ కాలంలో, ఈ ఒప్పందం రెండు ప్రాంతాల మధ్య వ్యాపార సంబంధాలకు స్పష్టత తీసుకురావడమే కాకుండా, కొత్త అవకాశాలను కూడా తెరవనుంది.
ఇండియా-EU FTA చరిత్ర
ఈ ఫ్రీ ట్రేడ్ ఒప్పందంపై చర్చలు తొలిసారిగా 2007లో ప్రారంభమయ్యాయి. అయితే టారిఫ్‌లు, మార్కెట్ యాక్సెస్, రెగ్యులేటరీ స్టాండర్డ్స్ వంటి అంశాలపై విభేదాల కారణంగా 2013లో ఈ చర్చలు నిలిచిపోయాయి. మళ్లీ 2022లో చర్చలు తిరిగి మొదలయ్యాయి. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ ప్రక్రియ భారతదేశ చరిత్రలోనే దీర్ఘకాలిక వాణిజ్య చర్చలలో ఒకటిగా నిలిచింది.
ఈ ఒప్పందంలో మొత్తం 24 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో వస్తువుల వ్యాపారం, సేవల వ్యాపారం, పెట్టుబడులు వంటి అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా పెట్టుబడి రక్షణ, భౌగోళిక గుర్తింపులు (Geographical Indications) వంటి అంశాలపై ప్రత్యేక చర్చలు కూడా ఇందులో భాగం.
ఈ ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వస్తుంది?
కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ చెప్పిన ప్రకారం, ప్రస్తుతం ఒప్పందాన్ని ఫార్మల్‌గా పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో దీనిపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో అమల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
భారతదేశంలో ఈ ఒప్పందం అమలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం అవసరం. అలాగే యూరోపియన్ యూనియన్ వైపు యూరోపియన్ పార్లమెంట్ ర్యాటిఫికేషన్ కూడా తప్పనిసరి. అందువల్ల ఈ ప్రక్రియ అమల్లోకి రావడానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది.
ఆటో రంగంపై ప్రభావం
ఈ ఒప్పందం ప్రభావం ఎక్కువగా కనిపించబోయే రంగాల్లో ఆటోమొబైల్ రంగం ముందుంది. ఈ ఒప్పందం ప్రకారం, యూరోప్‌లో తయారైన కార్లపై భారత్‌లో ఉండే దిగుమతి పన్నులు (టారిఫ్‌లు) సుమారు 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.
టారిఫ్‌లు 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉన్నందున... Volkswagen, BMW, Mercedes-Benz, Audi, Porsche, Maserati, Skoda, Volvo వంటి యూరోపియన్ బ్రాండ్లు భారత మార్కెట్‌లోకి మరింత బలంగా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. వేగంగా పెరుగుతున్న భారత కార్ మార్కెట్ వీరికి పెద్ద అవకాశంగా మారనుంది. ప్రస్తుతం, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లపై 110% వరకు పన్ను ఉంది.
అయితే భారత ప్రభుత్వానికి ఇక్కడ ఒక పెద్ద సవాల్ కూడా ఉంది. దేశీయ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా వంటి బ్రాండ్లను రక్షిస్తూ, మార్కెట్‌ను లిబరలైజ్ చేయడం ఒక కూడా అవసరమే. అలాగే, జపాన్ దిగ్గజం సుజుకి కూడా ఈ పోటీలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఎలక్ట్రిక్ కార్లపై ప్రత్యేక నిబంధనలు
ICE (పెట్రోల్, డీజిల్) కార్లపై టారిఫ్ తగ్గింపులు ఒప్పందం అమలైన వెంటనే వర్తించనున్నాయి. కానీ ఎలక్ట్రిక్ కార్ల విషయంలో మాత్రం వెంటనే తగ్గింపు ఉండదు. యూరోప్ నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ కార్లపై పన్నులు మొదటి ఐదు సంవత్సరాల పాటు యథాతథంగా కొనసాగుతాయి. ఆ తర్వాత మాత్రమే EVలపై దిగుమతి పన్నుల తగ్గింపు అమల్లోకి వస్తుంది.
కార్ల ధరలపై ప్రభావం
ప్రస్తుతం భారత్‌లో పూర్తిగా తయారైన కార్లపై 70 శాతం నుంచి 110 శాతం వరకు దిగుమతి పన్నులు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లలో ఒకటిగా చెబుతారు. ఈ పన్నులు తగ్గితే యూరోప్ నుంచి వచ్చే కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల భారత మార్కెట్‌లో యూరోపియన్ బ్రాండ్ల కార్లు మరింత తక్కువ ధరకు, మరిన్ని మోడళ్లు అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో దేశీయ తయారీదారుల్లో కూడా పోటీ పెరుగుతుంది.
మొత్తానికి, ఇండియా-EU FTA ఒక పెద్ద ఆర్థిక మార్పునకు దారితీయబోతోంది. ముఖ్యంగా ఆటో రంగంలో ఇది కొత్త యుగానికి నాంది కావచ్చు. భవిష్యత్తులో, భారత రోడ్లపై ఇండియన్ కార్లకు సమానంగా యూరోపియన్ కార్లు కూడా కనిపిస్తే ఆశ్చర్యపోనక్కర లేదు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















