Hero Surge: ఇది ఆటోనే కానీ స్కూటీగా కూడా వాడేయచ్చు - హీరో వెరైటీ వెహికిల్ చూశారా?
Hero New Vehicle: హీరో సర్జ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కమ్ ఆటోను కంపెనీ పరిచయం చేసింది.
Hero Electric Unique Wheeler: దేశీయ మార్కెట్లో ఉన్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఇటీవల తన కొత్త టూ ఇన్ వన్ వాహనంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది టూ వీలర్, త్రీ వీలర్ల కలయిక. దీన్ని అవసరమైతే రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్/ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో ఈ ప్రత్యేకమైన త్రీ వీలర్‌ను స్కూటర్ అవతార్‌గా మార్చడానికి కేవలం మూడు నిమిషాలు మాత్రమే పడుతుందని చూడవచ్చు.
సర్జ్ అనే పేరుతో...
హీరో తన ప్రత్యేకమైన కన్వర్టిబుల్ వాహనానికి ‘సర్జ్’ అని పేరు పెట్టింది. ఇది సర్జ్ ఎస్32 సిరీస్‌లో భాగంగా మార్కెట్లోకి రానుంది. అలాగే ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొదటి షిఫ్టింగ్ వెహికిల్‌గా నిలిచింది. దీన్ని వ్యక్తిగతంగా, వాణిజ్యపరంగా ఉపయోగించవచ్చు.
ధర ఎంత? లాంచ్ ఎప్పుడు?
ప్రస్తుతానికి హీరో ఈ ప్రత్యేకమైన టూ వీలర్, త్రీ వీలర్ ధర గురించి లేదా దాని లాంచ్ ఎప్పుడు అనే విషయం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఇంత ఎగ్జిక్యూషన్ లెవల్ వరకు వచ్చింది కాబట్టి త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఇంజిన్, ఫీచర్లు
ఇది రెండు రూపాల్లో ఉండనుంది. అంటే దీనిని ద్విచక్ర వాహనంగా ఉపయోగించినప్పుడు, ఇది 3 కేడబ్ల్యూ పవర్ కెపాసిటీతో పని చేస్తుంది. ఇందులో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్లోకి రానుంది. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
దీన్ని త్రీ వీలర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది 11 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 10 కేడబ్ల్యూ పవర్‌ని ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది 500 కిలోగ్రాముల బరువును వరకు ఎత్తగలదు.
మరోవైపు ఈవీ కంపెనీ కైనెటిక్ గ్రీన్ 2024 ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ మోపెడ్ ఈ-లూనాను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీని బుకింగ్ నామమాత్రపు టోకెన్ అమౌంట్ రూ. 500తో ప్రారంభం అవుతుంది. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కూడా కస్టమర్లు దీన్ని బుక్ చేసుకోగలరు. 1970 నుంచి 2000 సంవత్సరం వరకు దేశీయ మార్కెట్లో లూనా ఒక పాపులర్ ద్విచక్ర వాహనంగా ఉంది. ఇది సాధారణ డిజైన్, ఎక్కువ మైలేజీకి ప్రసిద్ధి చెందింది. అయితే ఈ-లూనా అందించే ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఇంకా కంపెనీ వెల్లడించలేదు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 నుంచి 75 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని అంచనా. ఈ-లూనాలో 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉండవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు ఉండనుంది.
కైనెటిక్ ఎలక్ట్రిక్ లూనాను మెట్రో, టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలతో పాటుగా గ్రామీణ మార్కెట్లలోని వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. పాత లూనా గ్రామాల్లో ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతానికి ఈ కారు ధరకు సంబంధించి కూడా ఎలాంటి సమాచారం లేదు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటే దీని ధరను అగ్రెసివ్‌గా ఉంచవచ్చని భావిస్తున్నారు.