BYD Seal: 15 రోజుల్లోనే 500 బుకింగ్స్ - కొత్త రికార్డులు సృష్టిస్తున్న సీల్!
BYD Seal Sales: ప్రముఖ కార్ల బ్రాండ్ బీవైడీ తన కొత్త కారు ‘సీల్’ను ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని సేల్స్ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి.
BYD Seal Booking: బీవైడీ ఇండియా ఇటీవల మనదేశంలో లాంచ్ చేసిన ‘సీల్’ కారు బుకింగ్స్ 500 యూనిట్ల మైలురాయిని దాటాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2024 మార్చి 5వ తేదీన లాంచ్ అయిన ఈ కారు కేవలం 15 రోజుల్లోనే ఈ మైలురాయిని పూర్తి చేసింది.
బీవైడీ సీల్ వివరాలు...
బీవైడీ సీల్‌ని మూడు వేరియంట్‌లలో కంపెనీ లాంచ్ చేసింది. వీటిలో డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ మోడల్స్ ఉన్నాయి. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే ఇవి 650 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలవని పేర్కొన్నారు. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.41 లక్షల నుంచి రూ.53 లక్షల వరకు ఉంది. ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే, కాస్మోస్ బ్లాక్‌తో సహా నాలుగు ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌లను కస్టమర్‌లు ఎంచుకోవచ్చు.
కంపెనీ ఏం చెప్పింది?
ఈ అచీవ్‌మెంట్ సందర్భంగా బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ ‘మా ఉత్పత్తి, మా ధరపై మాకు నమ్మకం ఉంది. మార్కెట్‌లో దీనికి లభించిన స్పందన చూసి సంతోషిస్తున్నాం. లాంచ్ అయిన వెంటనే ఇది 200 బుకింగ్ మార్క్‌ను తాకింది. ఇప్పుడు 15 రోజులలో 500 బుకింగ్‌లను రికార్డ్ చేశాం. భారతీయ కస్టమర్లు స్థిరమైన మోటరింగ్ కోసం పోటీ ధర, స్టైలిష్ సొల్యూషన్స్ కోసం ఆసక్తిగా ఉన్నారని ఈ డేటా చూపిస్తుంది. ఇప్పటికే కొత్త ఈ6తో ప్రీమియం ఎలక్ట్రిక్ ఎంపీవీని, బీవైడీ అట్టో 3తో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా లాంచ్ చేశాం. తాజా బీవైడీ సీల్ భారతదేశంలో మా పోర్ట్‌ఫోలియోను అత్యంత స్టైలిష్, లగ్జరీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ సెడాన్‌తో మరింతగా విస్తరించింది.’ అన్నారు.
పోటీ వేటితో?
భారతీయ మార్కెట్‌లో ఇది కియా ఈవీ6తో పోటీపడుతుంది. ఇది ఒక్కో ఛార్జ్‌కు 708 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 60.95 లక్షల నుంచి రూ. 65.95 లక్షల మధ్య ఉంది.