Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Bajaj Freedom CNG 125 Vs Honda Shine 125: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయింది. ఇది హోండా షైన్‌కు గట్టి పోటీని ఇవ్వనుంది. మరి రెండిట్లో ఏది బెస్ట్?
Bajaj Freedom CNG 125 Vs Honda Shine: బజాజ్ ఆటో ఇటీవల ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125ని భారత మార్కెట్లో విడుదల చేసింది. కమ్యూటర్ సెగ్మెంట్‌లో ఇది గొప్ప ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ బైక్ కొంటే మీరు పెట్రోల్, సీఎన్‌జీ రెండిటితోనూ డ్రైవ్ చేయవచ్చు. కానీ 125 సీసీ విభాగంలో హోండా షైన్ కూడా ఒక మంచి ఆప్షన్‌గా ఉంది. ఈ రెండు బైక్‌ల మధ్య సీఎన్‌జీ కాకుండా తేడా ఏంటి? ఏది కొంటే బెస్ట్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్: దేని ఇంజిన్ ఎలా ఉంది?
బజాజ్ కొత్త సీఎన్‌జీ బైక్‌లో 124.58 సీసీ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 9.5 బీహెచ్‌పీ పవర్, 9.7 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు హోండా షైన్ 123.94 సీసీ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 10.74 బీహెచ్‌పీ పవర్‌ని, 11 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
దీని ప్రకారం హోండా షైన్ కొంచెం ఎక్కువ శక్తివంతమైన ఇంజన్ కలిగి ఉంది. కానీ బజాజ్ ఫ్రీడమ్‌లో మీరు కేవలం ఒక స్విచ్‌తో పెట్రోల్, సీఎన్‌జీ మోడ్లను మార్చుకునే సదుపాయాన్ని పొందుతారు.
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్: దేని మైలేజ్ ఎక్కువ?
బజాజ్ సీఎన్‌జీ బైక్ సీటు కింద అమర్చిన ట్యాంక్‌లో రెండు కిలోల సీఎన్‌జీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కాకుండా ఇందులో రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది. మరోవైపు హోండా షైన్ 10.5 లీటర్ల పెద్ద ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది.
కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం బజాజ్ కొత్త సీఎన్‌జీ బైక్ సీఎన్‌జీపై కిలోకు 102 కిలోమీటర్లు, పెట్రోల్‌పై లీటరుకు 65 కిలోమీటర్లు మైలేజీని ఇస్తుంది. అంటే ఒక్కసారి రెండింటినీ ఫిల్ చేస్తే దాదాపు 330 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మరోవైపు హోండా షైన్‌లో మీరు లీటరుకు 55 కిలోమీటర్ల మైలేజీని పొందుతారు.
Also Read: టాటా నెక్సాన్ ఈవీ.. సేఫ్టీలో సూపర్ - భారత్ NCAP ఎంత రేటింగ్ ఇచ్చిందంటే?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్: దేని డిజైన్ బాగుంది?
ఇతర కమ్యూటర్ బైక్‌లతో పోలిస్తే బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 బైక్ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ బైక్‌లో మస్కులర్ డిజైన్‌తో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్ ఉంది. మరోవైపు హోండా షైన్ లుక్ ఇతర కమ్యూటర్ బైక్‌ల మాదిరిగానే ఉంటుంది.
ఈ రెండు బైక్‌లలో ఎలాంటి ప్రత్యేక ఫీచర్లు లేవు. కానీ బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 లేటెస్ట్ బైక్ కాబట్టి ఇందులో ఎల్సీడీ కన్సోల్‌తో పాటు బ్లూటూత్ ఉంది. మరోవైపు హోండా షైన్ మునుపటి బైక్‌ల్లో అందుబాటులో ఉన్న అనలాగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్: దేని ధర ఎంత?
ఇప్పుడు ఈ బైక్‌ల ధరల గురించి మాట్లాడుకుంటే బజాజ్ ఫ్రీడమ్ CNG 125 ఎక్స్ షోరూమ్ ధర రూ. 95 వేల నుంచి మొదలై రూ. 1.10 లక్షల వరకు ఉంటుంది. ఈ బైక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
హోండా షైన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.79,800 నుంచి మొదలై రూ.83,800 వరకు ఉంది. ఈ బైక్ డ్రమ్, డిస్క్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. హోండా షైన్ చాలా మంచి కమ్యూటర్ బైక్ అయినప్పటికీ ఇది తక్కువ ధరలో మార్కెట్లో లభ్యమవుతుంది. అయితే ఈ బైక్‌లో మీకు పెట్రోల్ ఆప్షన్ మాత్రమే లభిస్తుంది.
మరోవైపు బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 అనేది లో రన్నింగ్ కాస్ట్ బైక్. ఇది మీ ఖర్చులను తగ్గిస్తుంది. అయితే తక్కువ సంఖ్యలో సీఎన్‌జీ బంకులు, అక్కడ పొడవైన క్యూల గురించి మరచిపోకూడదు. పెట్రోల్ బంకులతో పోలిస్తే సీఎన్‌జీ బంకులు ఇప్పటికీ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి.
Also Read: ‘గ్రాండే పాండా’ను రివీల్ చేసిన ఫియట్ - వావ్ అనిపిస్తున్న కొత్త కారు!