YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Andhrapradesh News: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు ఏఫీ పీసీసీ చీఫ్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ధర్నాలో జగన్ స్వలాభం తప్ప.. రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని చెప్పారు.
YS Sharmila Counter To Ys Jagan: ఢిల్లీలో తమ ధర్నాకు కాంగ్రెస్ నేతలు ఎందుకు రాలేదో ఆ పార్టీనే అడగాలన్న మాజీ సీఎం జగన్ (YS Jagan) వ్యాఖ్యలపై.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి.? అని ప్రశ్నించారు. 'పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా.? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా.? 5 ఏళ్లుగా బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులు, ప్రత్యేక హోదాను వారికి తాకట్టు పెట్టినందుకా.?' అంటూ నిలదీశారు. మణిపూర్ ఘటనపై ఇన్నాళ్లూ నోరెత్తలేదని.. ఇప్పుడు ఉన్నట్టుండి జగన్‌కు అక్కడి పరిస్థితులు గుర్తుకురావడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో జగన్ బీజేపీకే మద్దతిచ్చారు కదా.? అంటూ షర్మిల నిలదీశారు.
'అందులో నిజం లేదు'
కాంగ్రెస్ పార్టీ @INCIndia ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న @ysjagan జగన్ గారు... మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి ?
— YS Sharmila (@realyssharmila) July 27, 2024
పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లు @BJP4India బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని,…
వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జగన్ జైకొట్టారు కదా.? అని షర్మిల ప్రశ్నించారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా.? అంటూ నిలదీశారు. జగన్ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందంటూ స్పష్టం చేశారు. ఈ ధర్నాలో జగన్ స్వలాభం తప్ప.. రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని కాంగ్రెస్ సంఘీభావం తెలపలేదని తెలిపారు. పోరాటానికి సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా.? ఇప్పుడు కలిసి పోరాడుదామని అంటున్నారని షర్మిల మండిపడ్డారు.
జగన్ ఏమన్నారంటే.?
ఏపీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని నిరసిస్తూ మాజీ సీఎం జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల ధర్నా నిర్వహించారు. ఈ దీక్షకు దీక్షకు ఇండీ కూటమి నాయకుల నుంచి సంఘీభావం లభించింది. ఆ కూటమిలోని అన్ని ప్రధాన పార్టీల నాయకులతో పాటు తటస్థ పార్టీల నాయకులు సైతం దీక్షా శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు. జగన్ దీక్షకు తమ మద్దతు ప్రకటించారు. ఈ ధర్నాకు అన్ని పక్షాల నేతలను ఆహ్వానించామని.. కానీ రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబుతో సన్నిహత సంబంధాలు నెరుపుతున్న కాంగ్రెస్, రాహుల్ గాంధీ మాత్రం రాలేదని అన్నారు. తమ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు రాలేదో ఆ పార్టీ నేతలనే అడగాలని శుక్రవారం మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు. మణిపూర్ అల్లర్లపై స్పందించే కాంగ్రెస్ పార్టీ.. ఏపీలో జరిగిన హింసపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు.