Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే చంద్రబాబు బయటకు రాలేరని.. కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్ అంటూ శాసన సభాపతి తమ్మినేని సీతారాం సీరియస్ కామెంట్స్ చేశారు.
Tammineni Seetharam: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపైన చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమదాలవలసలో బైక్ ర్యాలీ నిర్వహించారు వైసీపీ శ్రేణులు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. ముందు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి శాసన సభాపతి తమ్మినేని సీతారాం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ.. సీఎం జగన్ మేనిఫెస్టోను దైవంగా భావిస్తారని వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పటికే 98.7 శాతం అమలు చేశారని చెప్పారు.
హామీ ఇవ్వని ఎన్నో అంశాలను సైతం పరిష్కరించారని పేర్కొన్నారు తమ్మినేని. సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా ఏపీ నిలిచిందని, పెన్షన్ల పెంపు మొదలుకొని, లక్షల ఉద్యోగాల కల్పన, రైతు భరోసా, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు - నేడు,విప్లవాత్మక మార్పులతో ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ వాహన మిత్ర, చేయూత, మత్స్యకార భరోసా, కాపు నేస్తం లాంటి ఎన్నో కార్యక్రమాలు లక్షల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. కులం, పార్టీ, ప్రాంతం చూడకుండా నవరత్నాలు పేరుతో పేదలందరికీ ఇళ్లు అందజేసి దేశవ్యాప్తంగా సీఎం మన్ననలు పొందారని చెప్పారు. సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యానికి నాంది పలికాయన్నారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ అఖండ విజయం సాధించడం ప్రభుత్వం పట్ల ప్రజలకున్న గట్టి నమ్మకాన్ని తెలియజేసినట్లు అయిందని తమ్మినేని సీతారం అన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రత్యేకించి ఉత్తరాంధ్ర కష్టాలను చూసిన జగన్.. మాట ఇచ్చిన విధంగానే అభివృద్ధికి కట్టుబడ్డారని చెప్పారు. నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న భూమి హక్కు-భూ రక్షపథకం (రీ సర్వే) వంటి నిర్ణయాలు చారిత్రాత్మకమైన అంశాలుగా స్పీకర్ తమ్మినేని అభివర్ణించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సీతారాం పేర్కొన్నారు. అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారన్నారు. నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడపగడపకు మన ప్రభుత్వ లక్ష్యం ఉద్దేశ్యం గొప్పదన్నారు.
ఎందుకా కడుపు మంట?
ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు. రాష్ట్రంలో సుమారు 33 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకుడు, సెంటు స్థలంలో శవాలు పూడ్చుకోవడానికి తప్ప ఎందుకు సరిపోతుంది అనే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజమండ్రి మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో చూస్తుంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ పథకాలను కాపీ కొట్టారని, అయినా తెలుగు దేశం పార్టీనీ వారి ఇచ్చే హామీలను ప్రజల నమ్మరని అన్నారు. రాబోయే ఎన్నికలు పేదవాడికి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధమని తెలిపారు.
చంద్రబాబుకు సెక్యూరిటీని తొలగించాలి
టీడీరీ అధినేత, ప్రతిపక్షనాయకుడు నారా చంద్రబాబుకు ఎందుకు బ్లాక్ డ్రెస్ కమాండర్లు అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఈ సెక్యూరిటీని తొలగించాలని స్పీకర్ గా కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తానని స్పష్టం చేశారు. చాలా మంది నేతలకు హెచ్చరికలు ఉన్నాయని అయినా ఈయనకే ఎందుకు జడ్ ప్లస్ కేటగిరిని కేంద్ర ప్రభుత్వం కేటాయించిందో చెప్పాలన్నారు. హెచ్చరికలు ఉన్న నేతలందరికి సెక్యూటరీ ఇస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై పునరాలోచించాలని స్పీకర్ కోరారు.
చంద్రబాబు మహానాడులో లేనిపోనీ హామీలు గుప్పించి మరో సారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధ పడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబునాపై పరుష పదజాలంతో మండిపడ్డారు. అసలు ఆయనకు సెక్యూరిటీ లేకపోతే బయటకు రాలేరని.. ఆయన ఫినిష్ అయిపోతారని కామెంట్ చేశారు. ఆయన పాలనపై తూర్పారబట్టారు. ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి వెన్నుపోటు పొడిచారన్నారు. ఆరోజు చంద్రబాబు నాయుడు మాయలో తానూ పడ్డానని, దీంట్లో నేను భాగస్వామినని వ్యాఖ్యనించారు. అధికారంలో ఉండేటపుడు హామీలను నేరవేర్చడంలో విఫలమైన బాబును ప్రజలు గద్దె దించాశారని తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిపేస్టోను కాదు అందులో ఇవ్వని హామీలు నెరవేర్చి ప్రజల మనసుల్లో సీఎం జగన్ స్థానం సంపాదించుకున్నారన్నారు.