Budvelu : బద్వేలులో తిరుగులేని వైఎస్ఆర్‌సీపీ.. లక్ష మెజార్టీ దిశగా డాక్టర్ సుధ !
కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తిరుగులేని ఆధిక్యం లభించింది. చివరికి లక్షకుపైగా మెజార్టీ సాధించే అవకాశం కనిపిస్తోంది.
బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 9 రౌండ్ల పోలింగ్ ముగిసే సరికి 77వేల ఓట్లకుపైగా మెజార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ ఉన్నారు. సమీప ప్రత్యర్థులుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థికి రౌండ్‌కు వెయ్యి ఓట్ల వరకూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అందులో సగం మాత్రమే వస్తున్నాయి. 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. నియోజకవర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68.39 శాతం పోలింగ్ నమోదైంది. నోటాకు కూడా భారీగానే ఓట్లు పోలయ్యాయి. 8 రౌండ్లు ముగిసేసరికి రెండు వేలకుపైగా ఓట్లు నోటాకు పడ్డాయి.
బద్వేలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంపై ఎవరికీ అనుమానాల్లేవు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా బరిలో నిలబడలేదు. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చినందున సంప్రదాయాన్ని అనుసరించి వారు పోటీ నుంచి వైదొలిగారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల్ని నిలిపాయి. అలాగే కొంత మంది ఇండిపెండెంట్లు కూడా బరిలో నిలిచారు. ఈ కారణంగా ఎన్నిక అనివార్యమయింది.
లక్ష ఓట్ల మెజార్టీని లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి పంపించారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే బాధ్యతలు ఇచ్చారు. ఆయన ఎన్నిక గురించి ప్రతి విషయాన్ని పక్కాగా పరిశీలించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రచారంలో ఎక్కడా తగ్గలేదు. సీరియస్‌గా ప్రచారం చేశారు. ఎలక్షనీరింగ్ కూడా లోపాలు లేకుండా చేసుకున్నారు. ఓటర్లందర్నీ బూత్‌ల వద్దకు తరలించుకోగలిగారు. ఆ ఫలితం కౌంటింగ్‌లో కనిపిస్తోంది.
Also Read: ఓ కార్పొరేషన్ -12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ! ఏపీలో మినీ స్థానిక సమరానికి షెడ్యూల్ రిలీజ్ !
బద్వేల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నలభై వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ సారి అది రెండింతలు అవుతోంది. ఇది తమ ప్రభుత్వ పాలనకు ప్రజామోదానికి సాక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షం బరిలో లేనందునే అలాంటి ఫలితాలు వచ్చాయని విపక్షాలు అంటున్నాయి. బద్వేలులో గత ఎన్నికల్లో బీజేపీ నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ సారి దాదాపుగా 20వేలకుపైగా ఓట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది.
Also Read: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఎన్. చంద్రశేఖర్ రెడ్డి నియమాకం