AP Local Polls : ఓ కార్పొరేషన్ -12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ! ఏపీలో మినీ స్థానిక సమరానికి షెడ్యూల్ రిలీజ్ !
ఏపీలో పెండింగ్‌లో ఉన్న పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూ విడుదలయింది. ఈ నెల మూడో తేదీన ప్రారంభమై.. 18వ తేదీతో ప్రక్రియ పూర్తవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి స్థానిక ఎన్నికల సమరానికి నగరా మోగింది. కోర్టు కేసుల కారణంగా వాయిదా పడిన మున్సిపాలిటీలు, పంచాయతీ, పరిషత్ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. మొత్తంగా నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలు, 533 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగుతుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్, 17న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్, 18న కౌంటింగ్ నిర్వహిస్తారు. అన్ని స్థానిక సంస్థలకు ఈనెల 3 నుంచి 5 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
Also Read: ఏపీ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఎన్నికలు జరగనున్న స్థానాల్లో కుప్పం మున్సిపాలిటీ కూడా ఉంది. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే కార్పొరేషన్లలో నిలిచిపోయిన డివిజన్లకూ ఎన్నిక జరగనుంది. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లు, ►12 మున్సిపాలిటీల్లో 13 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.
Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?
498 గ్రామ పంచాయతీల్లో 69 సర్పంచ్ స్థానాలకూ కూడా ఎన్నిక జరుగుతుంది.అలాగే ఖాళీగా ఉన్న 533 వార్డు మెంబర్లకు కూడా ఈ నెల 14న ఎన్నిక, అదేరోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. 13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలు, 16 జడ్పీటీసీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. దాదాపుగా ప్రతి జిల్లాలోనూ ఎన్నికలు జరుగుతూండటంతో ఎన్నికల కోడ్ అంతటా అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు అనేక వివాదాలతో ఎన్నికలు జరిగాయి. చివరికి ఆయన మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను మాత్రమే నిర్వహించారు. ఆ తర్వాత ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్ని పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికలపైనా అనేక వివాదాలు వచ్చాయి. కోర్టు తీర్పు అనంతరం ఇటీవలే కౌంటింగ్ జరిగింది. ఇప్పుడు మరో స్థానిక సమరం ప్రారంభమయింది.