TTD News: తిరుమల శ్రీవారి దర్శనాలపై తెలంగాణ నేతల విమర్శలు - టీటీడీ కీలక నిర్ణయం
Tirumala News: శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వారానికి రెండుసార్లు వాటిని అనుమతించాలని నిర్ణయించింది.
TTD Key Decision On Telangana Leaders Recommendation Letters: తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించక పోవడంపై గత కొద్ది రోజులుగా వస్తోన్న విమర్శలు టీటీడీ (TTD) చెక్ పెట్టింది. స్వామి దర్శనానికి వారానికి రెండుసార్లు.. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది. కాగా, గత కొద్ది రోజులుగా తెలంగాణ నేతలు ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్తే తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని.. తమ సిఫారసు లేఖలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతలు సైతం అసహనం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల అంశాన్ని టీటీడీ పునఃపరిశీలించింది. ఆ లేఖలను అనుమతించాలని టీటీడీ బోర్డులోని మెజార్టీ సభ్యులు కోరారు. దీంతో వారానికి రెండుసార్లు సిఫారసు లేఖలను అనుమతిస్తూ టీటీడీ బోర్డు నిర్ణయించింది.
మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
మరోవైపు, టీటీడీపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ నుంచి వచ్చిన భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఉండేదని.. కానీ ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు. శ్రీశైలం మల్లన్నను ఆమె శుక్రవారం దర్శించుకున్నారు. 'మా దురదృష్టం వల్ల శ్రీశైలం కోల్పోయాం.. ఆంధ్రకు ఇవ్వాల్సి వచ్చింది. మా తెలంగాణ భక్తుల మీద టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ఇవ్వాలి. టీటీడీ తరఫున తెలంగాణలో ధర్మ ప్రచార, నిధులను కేటాయించాలి. గతంలో టీడీపీ హయాంలో తెలంగాణ విషయంలో ఎలాంటి నిబంధనలు అమలు చేశారో.. ఇప్పుడు కూడా వాటినే అమల్లోకి తీసుకురావాలి. తెలంగాణ నుంచి టీటీడీకి అధిక రాబడి వస్తోంది. తెలంగాణలో ఆలయాలు, కల్యాణ మండపాల నిర్మాణాల కోసం టీటీడీ ముందుకురావాలి. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ అంశాలపై చర్చించారు.' అని మంత్రి పేర్కొన్నారు.