Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఆగస్టు 1న పవిత్రోత్సవాల టికెట్లు ఆన్ లైన్ లో విడుదల
Tirumala Tickets : తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల్లో పాల్గొనేందుకు టీటీడీ భక్తులకు అవకాశం కల్పిస్తుంది. పవిత్రోత్సవాల టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
Tirumala Tickets : తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలను ఈ ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. మొత్తం 600 టికెట్లను ఆన్ లైన్ లో జారీ చేయనున్నారు. భక్తులు రూ.2,500 చెల్లించి టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులు స్నపన తిరుమంజనంలో, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గోవచ్చు. పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రాల్లో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్దకు చేరుకోవాలని టీడీపీ తెలిపింది. భక్తులు టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాల్సి ఉంటుంది.
ఆగస్టు 8 నుంచి 10 వరకు
కోవిడ్ ప్రభావంతో రెండేళ్ల పాటు శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించిన పవిత్రోత్సవాలను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8 నుంచి 10 వరకూ మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు ఆగస్టు 7వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో జరిగే పలు ఆర్జిత సేవలను టీటీడీ మూడు రోజుల పాటు రద్దు చేసింది.
పవిత్రోత్సవాలు అంటే?
వైష్ణవ సంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసో తెలియకో భక్తులు, సిబ్బంది వల్ల కలిగే దోషాల వల్ల ఆలయం పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకే మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవం పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవాలను 15వ శతాబ్దంలో 5 రోజుల పాటు నిర్వహించేవారని పురాణ ప్రతీతి. ముఖ్యంగా క్రీ.శ 1464లో ఒక తమిళ శాసనంలో ఈ పవిత్రోత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నట్లు సాళువ మల్లయ్యదేవ మహారాజు రాయించిన శాసనంతో ఈ విషయం స్పష్టమవుతుంది. అయితే శాసనాల ఆధారం ప్రకారం పవిత్రోత్సవాలను క్రీ.శ.1562 వరకు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఆ తరువాత కొంత కాలం పాటు పవిత్రోత్సవాలను నిర్వహించలేదు. 1962 నుంచి టీటీడీ పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది.
పవిత్రోత్సవాల్లో ఏం జరుగుతుందంటే?
పవిత్రోత్సవాలలో మొదటి రోజు శ్రీవారి ఆలయంలోని యాగశాలలో హోమాన్ని నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేస్తారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు అర్చకులు. శ్రీవారి మూలవిరాట్టుతో పాటు ఉత్సవమూర్తులు, అనుబంధ ఆలయాలలో అర్చకులు పవిత్రాలు సమర్పిస్తారు. ప్రత్యేకంగా అలంకరించి ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని తిరుమాఢ వీధిలో ఊరిగిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తారు. రెండో రోజు వైఖానస అగమ శాస్త్రం ప్రకారం అర్చకులు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగితే, భక్తుల వల్ల ఏదైనా దోషాలు జరిగి ఉంటే తొలగిపోవాలంటూ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు. ముందు స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం స్వామి వారి మూల విరాట్టుకు అనుబంధ ఆలయాల్లో విగ్రహాలకు పవిత్ర మాలలు సమర్పించడంతో కార్యక్రమం ముగుస్తుంది.
పలు సేవలు రద్దు
మొదటి రెండు రోజులు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించి పవిత్రాలు సమర్పిస్తారు. మూడో రోజు శ్రీవారి ఆలయంతో పాటు వివిధ అనుభంద ఆలయాల్లో దేవేరులకు సమర్పించిన పవిత్రాలను తొలగించి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించి పూర్ణాహూతి ఇవ్వడంతో పవిత్రోత్సవాలు ఘట్టం ముగుస్తుంది. పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 7వ తేదీన అంకురార్పణ సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా ఆగస్టు 9వ తేదీన అష్టదళ పాద పద్మారాధనతో పాటుగా ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకూ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు టీటీడీ రద్దు చేసింది.