Guntur: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్.. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు..
చదువు నేర్పాల్సిన గురువే ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది.
చదువు నేర్పాల్సిన గురువే ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. భయంతో బాలిక పాఠశాలకు వెళ్లనని చెప్పింది. ఏమైందని తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఉపాధ్యాయుడికి బాలిక బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వట్టిచెరుకూరుకు చెందిన 12 ఏళ్ల బాలిక స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. పాఠశాలలోని హిందీ టీచర్ రవిబాబు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక చెబుతోంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక పాఠశాలకు వెళ్లనని.. భీష్మించుకు కూర్చింది. ఏమైందని తల్లిదండ్రులు ప్రశ్నించగా.. టీచర్ ప్రవర్తన గురించి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు.. బంధువులు, స్థానికులతో కలిసి పాఠశాలకు వెళ్లారు. సదరు ఉపాధ్యాయుడిని బయటకు రమ్మని పిలిచి మూకుమ్మడిగా దాడి చేశారు.
పారిపోయేందుకు యత్నం.. దేహశుద్ధి..
బాధిత బాలిక బంధువులు దాడి చేస్తున్న సమయంలో ఉపాధ్యాయుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని వెంబడించి మరీ దేహశుద్ధి చేశారు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన మరికొందరు టీచర్లనూ కొట్టారు. దీంతో పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
చదవకపోవడం వల్లే మందలించా..
అయితే విద్యార్థిని చదవకపోవడం వల్లే కాస్త మందలించినట్లు ఉపాధ్యాయుడు చెబుతున్నారు. ఘటనపై డీఈవో ఆర్‌ఎస్ గంగా భవాని విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో విచారణ చేపట్టేందుకు తెనాలి డివిజన్ ఉప విద్యాధికారి శ్రీనివాసరావు పాఠశాలకు చేరుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందిస్తామని ఇన్‌చార్జి ఎంఈవో రమాదేవి వెల్లడించారు.