Andhra Statues Removal: ఏపీలో రోడ్లపై ఉన్న అనధికార విగ్రహాలు తొలగించాలని నిర్ణయం - ఎన్టీఆర్, వైఎస్అర్‌లవీ తొలగిస్తారా ?
Statues: ఏపీలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ కనిపించే విగ్రహాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయిచింది. మొత్తం ప్రభుత్వ భూముల్లో 2,524 అనధికారిక విగ్రహాలను తొలగించనున్నారు.

Removal of unauthorized statues in Andhra: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా పెట్టిన విగ్రహాలు, నిర్మాణాలపై కఠిన చర్యలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములు, రోడ్లపై 2,524 అనధికారిక విగ్రహాలు ఉన్నాయని వాటిని తొలగించాలని నిర్ణయించింది. రాష్ట్ర రహదారులుపై, జాతీయ రహదారులపై ఉన్న వాటన్నింటినీ తొలగించనున్నారు. 2013లో జారీ చేసిన GO Ms No.18 ప్రకారం, పబ్లిక్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సైడ్ ట్రాకులు, పబ్లిక్ యూటిలిటీ స్థలాల్లో విగ్రహాలు, నిర్మాణాలను నిషేధించారు. ఈ ప్రదేశాల్లో హై మాస్ట్ లైట్లు, స్ట్రీట్ లైట్లు, ట్రాఫిక్/టోల్ ఇన్‌ఫ్రా, అలంకరణ పనులు మాత్రమే అనుమతిస్తారు. జిల్లా కలెక్టర్లు ఈ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2019 GO తర్వాత కొత్త విగ్రహాలకు అనుమతులు ఇవ్వలేదని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనలను సమీక్షించి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 2,524 అనధికారిక విగ్రహాలు గుర్తించారు. రహదారులపై ఏర్పాటు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారుల మీద 38 విగ్రహాలు, ఆర్ అండ్ బీ రోడ్ల మీద 1,671 విగ్రహాలు, రాష్ట్ర రహదారులు మీద 815 విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు రోడ్డు భద్రతకు, ట్రాఫిక్ కు అడ్డంకిగా మారాయి. ఇటీవల జరిగిన సర్వేలో ఈ వివరాలు తేలాయి. ప్రభుత్వ భూములు, పబ్లిక్ స్థలాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వీటిని తక్కువ సమయంలో తొలగించాలని ఆదేశాలు.
2019 GO తర్వాత కొత్త విగ్రహాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, మార్గదర్శకాల ప్రకారం అనధికారిక విగ్రహాలను తొలగించాలని, రోడ్డు భద్రతను నిర్ధారించాలని సూచించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనలను సమీక్షించి, అవసరమైతే చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ చర్యలు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని రెవెన్యూ, మునిసిపల్ అలాంటి శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విగ్రహాలకు .. ఏపీ రాజకీయాలకు ప్రత్యేకమైన బంధం ఉంది. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత పాదయాత్ర చేసిన జగన్ ప్రతి చోటా విగ్రహాలను ఆవిష్కరించారు. వాటికి అనుమతులు లేవు. అలాగో పోటీగా టీడీపీ నేతలు కూడా విస్తృతంగా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటే ఎవర అడగరు కానీ రోడ్ల మీద నిర్మించడంతో వాటిని తొలగించాలని నిర్ణయించారు. వీటిని తొలగించేటప్పుడు రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
అయితే వైఎస్ఆర్ విగ్రహాలే కాదు.. ఎన్టీఆర్ విగ్రహాలను కూడా ..రోడ్డుకు అడ్డంగా ఉంటే తొలగిస్తామని ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. ఈ విగ్రహాల వల్ల తరచూ రాజకీయ సమస్యలు వస్తున్నాయి. రాజకీయ ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలనుకుంటే.. విగ్రహాలపై దాడి చేసి రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి సమస్యలకు విగ్రహాల తొలగింపే బెటర్ అని ప్రభుత్వం నిర్ణయించింది.





















