Power Supply in AP: ఏపీలో భారీగా కరెంటు కోతలు, ప్లాంట్లలో నిలిచిన ఉత్పత్తి, కారణం ఏంటంటే
ప్రతి గ్రామానికి కనీసం 1 నుంచి 2 గంటల పాటు వేర్వేరు సమయాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆఖరికి పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకు కూడా కొంత సమయం కరెంటు కోతలు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గురువారం ఏకంగా ఉదయం నుంచి రాత్రి వరకు విడతల వారీగా కరెంటు సరఫరా జరగలేదు. ప్రతి గ్రామానికి కనీసం 1 నుంచి 2 గంటల పాటు వేర్వేరు సమయాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆఖరికి పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకు కూడా కొంత సమయం కరెంటు కోతలు పెట్టారు. ఏపీలో రెండు థర్మల్ పవర్ ప్లాంట్లలో సాంకేతిక సమస్య ఏర్పడడం వల్లే కరెంటు ఉత్పత్తి నిలిచిపోయింది.
ఏపీ జెన్‌కోకు చెందిన కృష్ణ పట్నం థర్మల్ పవర్ ప్లాంటు (800 మెగావాట్ల సామర్థ్యం), విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో (500 మెగావాట్ల సామర్థ్యం) ఉన్న ప్లాంట్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. కర్మాగారంలోని బాయిలర్ ట్యూబులో లీకేజీ రావడంలో గురువారం ఉదయం నుంచి ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచింది. దీనికితోడు విశాఖపట్నంలోని సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నుంచి మరో 400 మెగావాట్ల ఉత్పత్తి కూడా నిలిచింది. ఈ మూడు ప్లాంట్ల నుంచి కరెంటు నిలవడంతోపాటు.. కడప ఆర్‌టీపీపీలో 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడో యూనిట్, వీటీపీఎస్‌లో 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మొదటి యూనిట్‌ను మరమ్మతుల కోసం నిలిపేశారు.
ఎన్టీపీసీలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా గురువారం 800 మెగావాట్ల కొరత తలెత్తిందని, అందుకే ఐదు జిల్లాల పరిధిలో విద్యుత్తు కోతలు విధించాల్సి వచ్చిందని ఈపీడీసీఎల్ సీఎండీ సంతోషరావు తెలిపారు. అయితే, తమ పరిధిలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని ఎన్టీపీసీ వర్గాలు తెలిపాయి
తగ్గిపోయిన విద్యుత్ రాక.. కొందామన్నా దొరకని విద్యుత్
దీంతో గ్రిడ్‌కు ఎప్పటిలాగా వచ్చే సుమారు 1,700 మెగావాట్ల విద్యుత్ రాక తగ్గిపోయింది. ఇదే టైంలో రాష్ట్రంలో కరెంటు డిమాండ్ సుమారు 194 మిలియన్ యూనిట్లుగా ఉండడంతో కోతలు విధించడం తప్పనిసరి అయింది. రాష్ట్రంలో విద్యుత్ లోటు ఏర్పడడంతో దాన్ని భర్తీ చేసేందుకు ఇతర మార్గాల్లో కరెంటు కొనుగోలుకు ప్రయత్నించినా కుదరలేదు. ప్రస్తుతం యూనిట్ ఖర్చు రూ.15 వరకు ఉంది. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో అక్కడ విద్యుత్ అవసరాలు తీర్చడానికి ఎక్కువ ధర పెట్టి ఆ ప్రభుత్వాలు కొంటున్నాయి. దీంతో ఎక్కువకు కూడా విద్యుత్ దొరకలేదు.
ఆ నిర్ణయాలు దుర్మార్గం: విద్యుత్ ఉద్యోగులు
మరోవైపు, ఏపీ రాష్ట్రస్థాయి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తమ డిమాండ్లను నెల కిందటే చెప్పామని అన్నారు. ట్రాన్స్ కో సీఎండీ, ఇంధన శాఖ కార్యదర్శికి రెండు పదవులు సరికాదని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ థర్మల్ ప్లాంట్లను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కృష్ణపట్నం ప్లాంటు ప్రైవేటుపరం చేసే నిర్ణయం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.