Paritala Sriram: వాళ్లను గుర్తు పెట్టుకుంటాం, టీడీపీ అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం! పరిటాల శ్రీరామ్ ఘాటు వ్యాఖ్యలు
Paritala Sriram: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటామని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు.
Paritala Sriram: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటామని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. శుక్రవారం రాప్తాడు నియోజకర్గ కేంద్రం టీడీపీ కార్యాలయంలో వాల్మీకి గర్జన సభ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. ఆక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక, ఒక్కొక్కడి అంతుచూస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
న్యాయవాదులు సైతం వైసీసీ అక్రమ పాలనపై సామాజిక మాధ్యమాల ద్వారా విరుచుకుపడటం చూస్తుంటే, సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదని శ్రీరామ్ అన్నారు. వాల్మీకి రామాయంలో అన్నదమ్ముళ్లు ఎలా కలిసి ఉండాలో చెప్పారని, వైసీపీ ప్రభుత్వం ప్రజల మధ్య ఎలా చిచ్చుపెట్టేలో చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. యుద్ధంలో ముందుండి పోరాడిన వాల్మీకిల చరిత్ర గురించి వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు.
వాల్మీకిలకు టీడీపీ అండగా ఉంటుందని వచ్చే ఎన్నికల్లో అంతా కలిసి ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఊరి సమస్యలను ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిన ప్రభుత్వంపై అలుపెరగని యుద్ధం చేసిన మీరంతా మరో నాలుగు నెలలు కష్టపడితే సైకో పాలనకు చరమగీతం పాడొచ్చని అన్నారు. దుర్మార్గుడిని చూసి ఎవరూ భయపడొద్దని, ఎవరూ అధైర్య పడొద్దని కలిసికట్టుగా ఈ సైకోని ఎదుర్కొందామంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు.
అక్రమంగా చంద్రబాబు అరెస్ట్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని శ్రీరామ్ ఆరోపించారు. చంద్రబాబును నేరుగా ఎదుర్కొనలేక జగన్ రెడ్డి కక్ష పూరిత చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కేసు వాదిస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా చేసిన ట్వీట్ గురించి వివరిస్తూ.. న్యాయం కనుచూపు మేర లేనప్పుడు కత్తి తీసి ఖండఖండాలుగా నరకడమే అసలైన న్యాయం అన్నారు. ఒక గొప్ప న్యాయవాది, ఉన్నతంగా చదివిన వ్యక్తి, దేశ వ్యాప్తంగా పేరు మోసిన విద్యావేత్త ఆ మాటలు అన్నారంటే రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలన్నారు.
వాల్మీకులు అంతా సమైక్యంగా ఉండాలని, అంతా కలిసి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసేలా చూడాలన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, లేకపోతే రాష్ట్రం చీకట్లో మగ్గిపోతుందని అన్నారు. రాష్ట్రాభివృద్దికి చంద్రబాబు నిరంతరం కృషి చేశారని, పార్టీ శ్రేణులను క్రమశిక్షణతో ముందుకు నడిపించారని అన్నారు. అలాంటి వ్యక్తిని ఆధారాలు లేని కేసులో ఇరికించి జైలులో పెట్టారని అన్నారు.
చంద్రబాబుతోనే వాల్మీకిలకు ఎస్టీ హోదా
వాల్మీకిల ఎస్టీ జాబితా సాధించాలంటే 2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత అన్నారు. వాల్మీకి గర్జన సభలో వారు మాట్లాడుతూ.. ఏ తప్పు చేయని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 45 రోజులుగా జైలులో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్ కేవలం కక్ష సాధింపుతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇన్ని రోజులుగా న్యాయం జరుగుతుందని ఇప్పటికీ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకుల కారణంగా న్యాయస్థానాలపై నమ్మకం పోయే ప్రమాదం ఉందన్నారు. కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని చెప్పారు. చంద్రబాబుకు వాల్మీకులు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. వాల్మీకీలంతా ఏకమై రానున్న ఎన్నికల్లో ఈ సైకో పాలనపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. అరాచక అవినీతి శక్తులను అంతమొందించాలంటే ప్రజలంతా ఏకమవ్వాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలన్నారు.