Nara Bhuvaneswari: 'పేదలపై పెత్తందారీ పోకడలకు నిదర్శనం' - పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై దాడి, భువనేశ్వరి స్పందన
Nara Bhuvaneswari: రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై దాడే ఉదాహరణ అని నారా భువనేశ్వరి అన్నారు. సైకిల్ ర్యాలీ చేస్తున్న వారిపై వైసీపీ నేతల దాడిని ఆమె ఖండించారు.
Nara Bhuvaneswari: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సైకిల్ ర్యాలీ చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మద్దతుదారులు పుంగనూరులో దాడి చేయడం దారుణమని నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనం. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఇదే ఉదాహరణ. బీహార్ లో కూడా ఇంతటి అరాచక పరిస్థితులు లేవు. టీడీపీ అంటేనే ఓ కుటుంబం. పార్టీ అధినేతను అక్రమంగా జైల్లో పెడితే నిరసన కూడా తెలపకూడదా.? కార్యకర్తలకు సైకిల్ యాత్ర చేసే హక్కు కూడా లేదా.?. సామాన్యులకు చేసిన అవమానాలను ప్రజలంతా గమనిస్తున్నారు. అధికారం ఎల్లకాలం ఉండదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే.' అని భువనేశ్వరి అన్నారు.
పుంగనూరులో శ్రీకాకుళం వాసులను చొక్కాలిప్పించిన ఘటన చూసి నేను షాక్ కు గురయ్యాను. ప్రజలందరినీ ఇది నివ్వెరపరిచింది. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనం. 30 ఏళ్ల క్రితం బీహార్ లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవు. పేదలపై పెత్తందారీ పోకడలు అంటే ఇవే! తెలుగుదేశం అంటే ఒక కుటుంబం.… pic.twitter.com/gRXXSS2kRQ
— Nara Bhuvaneswari (@ManagingTrustee) October 21, 2023
ఏం జరిగిందంటే.?
స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు సంఘీభావంగా కొందరు టీడీపీ కార్యకర్తలు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, నారువాక మాజీ సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో అదే గ్రామానికి చేందిన రామసూరి, సుందరరావు, ఆదినారాయణ, రమేష్,లు సైకిల్ యాత్ర చేస్తూ శుక్రవారం సాయంత్రం పుంగనూరు మండలంలోని సుగాలిమిట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న సమయంలో స్థానిక వైసీపీ నేత వీరితో దురుసుగా ప్రవర్తించాడు. మీ నాయకుడు ఎవడ్రా అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. సైకిల్స్ పై ఉన్న టీడీపీ జెండాలు తొలగించడమే కాక వారి చొక్కాలను తీయించి దుర్భాషలాడాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం అని తెలిసి ఎలా సైకిల్ యాత్ర చేస్తారంటూ ప్రశ్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనిపై టీడీపీ నేతలు, శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే, వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు లేదు.' అంటూ ట్వీట్ చేశారు.
'నిజం గెలవాలి' పేరిట నారా భువనేశ్వరి యాత్ర
రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి 'నిజం గెలవాలి' పేరుతో నారా భువనేశ్వరి యాత్ర చేపడతారని నారా లోకేశ్ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆమె యాత్ర ప్రారంభిస్తారని చెప్పారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యాక ఆవేదనతో మరణించిన వారి కుటుంబాలని పరామర్శిస్తారని వెల్లడించారు. యాత్ర ప్రారంభానికి ముందు ఈ నెల 24న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. అదే రోజున బయల్దేరి నారావారిపల్లెకు వెళ్తారని అన్నారు.
Also Read: కంటతడి పెట్టిన నారా లోకేశ్ - ప్రజల కోసమే చంద్రబాబు నిరంతర పోరాటం అంటూ భావోద్వేగం