RRR Vs YSRCP : ఓదార్పు హక్కు జగన్‌కే ఉంటుందా.. లోకేష్ అడ్డగింతపై ఎంపీ విమర్శలు
లోకేష్‌ను అడ్డుకోవడం సరి కాదని పార్టీ ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం అలా అడ్డుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. పలు అంశాలపై ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నర్సరావుపేట పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు భిన్నంగా స్పందించారు. ఓదార్పు చేసే హక్కు సీఎం జగన్ ఒక్కరికే ఉంటుందా అని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నర్సరావుపేటలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కోట అనూష కుటుంబాన్ని పరమర్శించేందుకు లోకేష్ నర్సరావుపేట వెళ్లాలనుకున్నారు. అయితే అక్కడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై రఘురామకృష్ణరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అలా ఎవర్నీ తిరగకుండా అడ్డుకుని ఉంటే సీఎం జగన్ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ఉండేవారా అని ప్రశ్నించారు. లోకేష్‌ను వదిలిసే ఉంటే ఆయన దారిన ఆయన వెళ్లి ఓదార్పు చేసి ఉండేవారని పోలీసులు అడ్డుకుని తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
Also Read : ఏపీ ప్రభుత్వ బ్రాండ్ న్యూ మటన్
సినిమా ధియేటర్ల టిక్కెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలన్న నిర్ణయం సరి కాదని రఘురామ వ్యాఖ్యానించారు. సినిమా హాళ్లు, టిక్కెట్లపై ప్రభుత్వం పెత్తనం ఏంటని నిలదీశారు. గంగవరం పోర్టు లాంటి లాభాల్లో ఉన్న సంస్థను నడపకుండా అమ్ముకుంటూ టిక్కెట్ల వ్యాపారమేంటని ప్రశ్నించారు. ఇప్పటికే టిక్కెట్ రేట్లను దారుణంగా తగ్గించారని పదేల్ల కిందటి నాటి టిక్కెట్ రేట్లను ఖరారు చేశారని గుర్తు చేశారు. దీనిపై చిరంజీవి సహా సినీ ప్రముఖులు స్పందించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. అదే సమయంలో మటన్ మార్ట్‌లు పెట్టబోతున్నామంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనపైనా సెటైర్లు వేశారు. ప్రభుత్వం మటన్ అమ్ముకోవడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు.
Also Read : సర్కారు వారి బుకింగ్స్‌పై నోరు మెదపని టాలీవుడ్..!
చెత్త బండ్లకు కూడా వైసీపీ పార్టీ రంగులు ఎందుకు వేస్తున్నారని రఘురామ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా అధికారులకు బుద్ధి రావట్లేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై తాను వేసిన పిటిషన్‌పై సాక్షి మీడియాలో ముందే తీర్పు రావడంపై పట్ల రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆ అంశంపై సీబీఐ కోర్టులో విచారణ జరిగిందని రఘురామ తెలిపారు. ఆ తీర్పు సమాచారం ఎలా వచ్చిందో సాక్షి మీడియా ఉన్నాతాధికారులు కోర్టుకు తెలియచేయాల్సి ఉందన్నారు. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుందని తెలిపారు.
Also Read : ఏపీ రాజకీయాల్లో రష్యా "పార్టీ"
ప్రకాశం జిల్లా లింగ సముద్రంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారన్న భయంతో ఇద్దరు టీడీపీ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో చంద్రబాబుకు నేరుగా ప్రకాశం జిల్లా ఎస్పీ లేఖ రాయడాన్ని తప్పు పట్టారు. చంద్రబాబు డీజీపీకి లేఖ రాస్తే ఎస్పీ చంద్రబాబుకు ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు. బెదిరించేలా ఉన్న ఇలాంటి లేఖలు మంచి పద్దతి కాదన్నారు.