AP Tollywood : సర్కారు వారి బుకింగ్స్‌పై టాలీవుడ్ సైలెన్స్ ! వారికి ఆమోదమేనా..?
ఏపీ ప్రభుత్వం తీసుకున్న టిక్కెట్ పోర్టల్ నిర్ణయంపై టాలీవుడ్ పెద్దలు స్పందించలేదు. తమ వ్యాపారానికి సంబంధించి అత్యంత కీలక నిర్ణయంపై ఆమోదమో.. వ్యతిరేకతో తెలియ చేయడానికి కూడా వారు సంకోచిస్తున్నారు.
సినీ పరిశ్రమకు సంబంధించి ఓ అతి పెద్ద సంస్కరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక సినిమాలకు సంబంధించి టిక్కెట్ల బుకింగ్‌లన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సాగేలా చేయబోతోంది. ఇందు కోసం ప్రాథమిక నిర్ణయం తీసుకుని విధివిధానాల కోసం కమిటీని నియమించింది. అయితే ఈ అంశంపై ప్రధానంగా ప్రభావితమయ్యేది సినీ పరిశ్రమ, కానీ ఆ పరిశ్రమ నుంచి ఒక్కటంటే ఒక్క స్పందన కూడా బయటకు రావడం లేదు. స్వాగతిస్తున్నామని కానీ వ్యతిరేకిస్తున్నామని కానీ చెప్పడం లేదు. దీంతో మౌనం అర్థాంగీకారమే అన్నట్లుగా ప్రభుత్వం అభిప్రాయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
టాలీవుడ్ అభిప్రాయాలు తీసుకోకుండానే ఏపీ సర్కార్ "పోర్టల్" నిర్ణయం !
ప్రస్తుతం సినిమా టిక్కెట్ల అమ్మకాలు అటు ఆన్ లైన్ ఇటు ఆఫ్ లైన్ పద్దతిలో సాగుతున్నాయి. బుక్ మై షో, పేటీఎం సహా అనేక యాప్స్‌లో సినిమా టిక్కెటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఆఫ్ లైన్ పద్దతిలో కౌంటర్ల దగ్గర కూడా అమ్ముతున్నారు. ఆన్ లైన్‌లో అమ్ముడయ్యే టిక్కెట్ల కంటే ఆఫ్ లైన్‌లో అమ్ముడయ్యే టిక్కెట్లే ఎక్కువగా ఉంటాయి. ఎలా అమ్మినా టిక్కెట్ సేల్స్ నేరుగా డిస్ట్రిబ్యూటర్‌కు చేరుతుంది. లాభమో నష్టమో ఆయనే తేల్చుకుంటారు. ఆదాయం మాత్రం కళ్ల ముందు కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకు రావాలనుకుంటున్న విధానం ద్వారా ఇక బుక్ మైషో, పేటీఎం వంటి ద్వారా టికెట్ బుకింగ్ ఆఫ్షన్ ఉండదు. అలాగే కౌంటర్లనూ అమ్మకపోవచ్చని చెబుతున్నారు. చిన్న చిన్న పట్టణాల్లోనూ ఆన్ లైన్ టిక్కెట్లే పెట్టాలనుకుంటున్నారని ప్రాథమిక సమాచారం కాబట్టి మొత్తంగా టిక్కెట్ సేల్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగునుంది. అయితే సినీ ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో ప్రభావితం అయ్యే నిర్ణయం అయినప్పటికీ ప్రభుత్వం నియమించిన కమిటీలో ఒక్కరంటే ఒక్కరూ సినీ పరిశ్రమకుచెందిన వారు లేరు. వారి అభిప్రాయాలనూ కూడా ప్రభుత్వం తెలుసుకోలేదు.
ప్రభుత్వ నిర్ణయంపై నోరు మెదపని టాలీవుడ్ పెద్దలు !
ఇప్పటి వరకూ ఉన్న విధానం ద్వారా నేరుగా నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్‌కు ఆదాయం వస్తుంది. కానీ ఇక నుంచి ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా అమ్మతారు కాబట్టి సేల్స్ అమౌంట‌్ మొత్తం ప్రభుత్వ ఖాతాలోకే వెళ్తుంది. ఆ తర్వాత పన్నులు, సర్వీస్ చార్జీ అన్నీ మినహాయించుకుని నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్‌కు ఇస్తారు. ఎప్పుడు ఇవ్వాలి.. ఎలా ఇవ్వాలి అన్నది ప్రభుత్వం విధి విధానాల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే బయట సామాన్యులకు మాత్రం మొత్తం ఏ టూ జడ్ కష్టపడేది నిర్మాత లేదా యూనిట్ అయితే కలెక్షన్లు ప్రభుత్వానికి చేరడం ఏమిటన్న సందేహం వచ్చింది. అయితే ఇది టాలీవుడ్‌లో పెద్దలకు వచ్చినట్లుగా లేదు. ఈ అంశంపై వారు స్పందించడానికి సిద్ధంగా లేరు. ఎవరూ స్పందించలేదు కూడా. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎవరూ తమ అభిప్రాయం చెప్పడానికి సిద్ధపడలేదు.
Also Read : ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఫైర్
టాలీవుడ్ పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్ ప్రముఖులకు సన్నిహిత సంబంధాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గతంలో రెండు సార్లు తాడేపల్లి వెళ్లి భేటీ అయ్యారు కూడా. ఇక నాగార్జునకు జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం బహిరంగం. ఇక టాలీవుడ్‌కు మరో పిల్లర్ లాంటి మోహన్ బాబు నేరుగా అధికార పార్టీ సభ్యుడు. టీడీపీతో సంబంధం ఉన్న కొద్ది మంది మినహా మిగిలిన అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లవుతుందేమోనని వారు సైలెంట్‌గా ఉన్నారేమోనన్న అభిప్రాయం వినిపిస్తోంది. లేకపోతే ప్రభుత్వ పోర్టల్ వల్ల ఇండస్ట్రీకి మేలు జరుగుతుందన్న అంచనాకూ వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే అదే నిజం అయితే ప్రభుత్వంపై ప్రశంసలు జల్లు కురిపించడానికి ఎప్పుడూ మొహమాటపడని సినీ పెద్దలు ఇప్పుడు మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటారన్న సందేహం వస్తుంది.
Also Read : బాలినేని రష్యా పార్టీ వెనుక లోగుట్టేంటి ?
మేలు జరిగితే అదే చెప్పడానికి మొహమాటం ఎందుకు ?
ఎలా చూసినా సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు టిక్కెట్లు ఎక్కడైనా కొనుక్కుంటారు. వారికి సమస్య లేదు. కానీ ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రధానంగా ప్రభావితమయ్యేది టాలీవుడ్ ఇండస్ట్రీనే. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న ఇండస్ట్రీకీ ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం కీడు చేస్తుందా..? మరిన్ని సమస్యలు సృష్టిస్తుందా..? లేక మేలు చేస్తుందా అన్నది ముందుగా వారు తేల్చుకోవాల్సి ఉంది. సైలెంట్‌గా ఉంటే ప్రభుత్వం అర్థాంగీకారంగా తీసుకుని మరింతగా ఇండస్ట్రీని తమ అధీనంలోకి తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.